: టోల్ సిబ్బంది తనను కొట్టారని ఎదురు కంప్లయింట్ ఇచ్చిన నిమ్మల కిష్టప్ప కుమారుడు అంబరీష్
కర్ణాటకలో టోల్ ప్లాజాపై దాడికి దిగిన తెలుగుదేశం ఎంపీ నిమ్మల కిష్టప్ప కుమారుడు నిమ్మల అంబరీష్, టోల్ సిబ్బందిపై ఎదురు కంప్లయింట్ ఇచ్చారు. ఈ మధ్యాహ్నం బాగేపల్లి పోలీస్ స్టేషనుకు వచ్చిన ఆయన, టోల్ సిబ్బంది తనపై దాడికి దిగి కొట్టారని, అందువల్లే తాను భయంతో సమీపంలోనే ఉన్న టీడీపీ కార్యకర్తల సహాయం కోరానని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. వారు వచ్చి ఏం చేశారో తనకు తెలియదని చెప్పారు. టోల్ ప్లాజాలో జరిగిన దాడి వెనుక తాను లేనని అన్నారు. గేటు వద్ద తనను అకారణంగా అడ్డుకున్నారని, వారు అధికమొత్తం అడిగినందునే తాను వాదించాల్సి వచ్చిందని చెప్పారు. అంబరీష్ ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు, ఇప్పటికే కేసు నమోదు చేసి విచారిస్తున్నామని, తప్పు ఎవరిదైతే వారిపై కేసు కొనసాగుతుందని స్పష్టం చేశారు.