: చంద్రబాబును కలిశాక ఆ పేరును నేనే స్వయంగా చెబుతా: అఖిలప్రియ
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని కలిసి చర్చించిన తరువాత, నంద్యాల నుంచి ఉపఎన్నికల్లో పోటీ పడే తెలుగుదేశం అభ్యర్థి ఎవరన్న విషయాన్ని తానే స్వయంగా ప్రకటిస్తానని ఏపీ మంత్రి భూమా అఖిలప్రియ చెప్పారు. ఈ ఉదయం తన తల్లి శోభా నాగిరెడ్డి వర్థంతి సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న ఆమె, వేలాదిగా హాజరైన టీడీపీ కార్యకర్తలు, భూమా కుటుంబ అభిమానులను ఉద్దేశించి మాట్లాడారు.
టికెట్ తమ కుటుంబానిదేనని మరోసారి స్పష్టం చేసిన ఆమె, ఎవరిని నిలపాలన్న విషయమై చంద్రబాబుతో మాట్లాడాల్సి వుందని, అందువల్లే ఇప్పుడు పేరును చెప్పలేకపోతున్నానని అన్నారు. తన తండ్రి మరణంతో సీటు ఖాళీ అయింది కాబట్టి, మరే ఇతర పార్టీ పోటీ పెట్టకుండా ఏకగ్రీవంగా ఎన్నిక జరిగేందుకు సహకరించాలని ఆమె కోరారు. ఒకవేళ ఎవరైనా పోటీకి దిగినా, గెలుపు తమదేనన్న ధీమాను అఖిలప్రియ వ్యక్తం చేశారు.