: ఇండియాలో తొలిసారి... మోసపోయిన చిట్ ఫండ్ బాధితులకు చంద్రబాబు చేతుల మీదుగా నేడు డబ్బు పంపిణీ
అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ లో సంచలనం కలిగించిన వీఆర్ చిట్ ఫండ్స్ కేసులో మోసపోయిన బాధితులకు ఇవాళ పరిహారాన్ని సీఎం చంద్రబాబు స్వయంగా పంపిణీ చేయనున్నారు. విశాఖ కేంద్రంగా పనిచేస్తూ, సుమారు పదేళ్ల క్రితం బోర్డు తిప్పేసిన సంస్థ ఆస్తులను వేలం వేసే ప్రక్రియ పూర్తి కావడంతో, నేడు విజయవాడలో బాధితులకు వారు కట్టిన మొత్తానికి సంబంధించిన డబ్బును తిరిగి ఇవ్వనున్నారు. ఓ చిట్ ఫండ్ సంస్థ మోసం చేసిన కేసులో పూర్తి స్థాయిలో పరిహారం తిరిగి చెల్లించడం ఇండియాలోనే ఇదే తొలిసారి కావడం గమనార్హం.
వీఆర్ చిట్ ఫండ్స్ చేతిలో మోసపోయిన మొత్తం 2,200 మంది బాధితులకు రూ. 27 కోట్లను పరిహారంగా చంద్రబాబు పంచనున్నారు. వీరిలో అత్యధికులు ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన వారేనని తెలుస్తోంది. కాగా, అప్పట్లో ప్రజల నుంచి సేకరించిన డబ్బుతో భారీ ఎత్తున భవనాలు కొని, ఆపై సంస్థ యాజమాన్యం ఐపీ పెట్టిన సంగతి తెలిసిందే. కేసును నమోదు చేసిన సీఐడీ విభాగం, ఆయా ఆస్తులన్నీ సీజ్ చేసి కోర్టు ఆదేశాల మేరకు వేలం నిర్వహించింది.