: నేడు నంద్యాల అభ్యర్థిని ప్రకటించనున్న అఖిలప్రియ!
తన తల్లి, దివంగత ఎమ్మెల్యే భూమా శోభా నాగిరెడ్డి వర్థంతి సభ సందర్భంగా నంద్యాల ఉప ఎన్నికల్లో భూమా కుటుంబం నుంచి పోటీ చేసే అభ్యర్థి పేరును మంత్రి అఖిలప్రియ స్వయంగా ప్రకటిస్తారని తెలుస్తోంది. ఇప్పటికే టికెట్ తమ కుటుంబానిదేనని అఖిలప్రియ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. శోభ వర్థంతి కార్యక్రమాలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతుండగా, కార్యక్రమానికి వచ్చే అభిమానులు, కార్యకర్తలను ఉద్దేశించి అఖిలప్రియ ప్రసంగించనున్నారు.
ఈ సందర్భంగానే ఆమె తమ ఇంటి నుంచి ఎవరు పోటీ పడతారో ప్రకటించి, వారికి మద్దతు ఇవ్వాలని కోరనున్నట్టు సమాచారం. కాగా, నంద్యాల టికెట్ తనకే కావాలని శిల్పా మోహన్ రెడ్డి సైతం పట్టుబడుతూ ఉండటం, ఈ విషయంలో తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడి నుంచి ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటనా వెలువడకపోవడంతో, సీటు ఎవరికి లభిస్తుందన్న విషయమై ఉత్కంఠ నెలకొని వుంది.