: జయలలిత ఊటీ ఎస్టేట్ కు చేరుకున్న పోలీసులు... విచారణ ప్రారంభం
జయలలిత ఊటీ ఎస్టేట్ వాచ్ మెన్ దారుణ హత్యపై విచారణ జరిపేందుకు 10 మందితో కూడిన ఊటీ పోలీసుల బృందం ఎస్టేట్ కు చేరుకుంది. హత్య, ఆస్తి పత్రాల దగ్ధంపై ఫిర్యాదును అందుకున్న పోలీసులు, హత్యపై ఆధారాలు సేకరించే పనిలో పడ్డారు. ఈ ఘటనలో గాయపడిన బహదూర్ అనే వాచ్ మెన్ సహాయకుడిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఆస్తిపత్రాలు దహనం అయిన విధానాన్నీ పరిశీలిస్తున్నారు.
ఏఏ ఆస్తులకు సంబంధించిన పత్రాలను తగులబెట్టారన్న విషయమై, ఎస్టేట్ లోని మిగతా పనివాళ్ల నుంచి సమాచారాన్ని సేకరించే దిశగా ప్రశ్నిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఫోరెన్సిక్ నిపుణులతో పాటు క్లూస్ టీమ్ రంగంలోకి దిగింది. ఇటీవలి కాలంలో జయలలిత ఆస్తులకు చెందిన పత్రాలను దహనం చేస్తుండటంపై ఆమె అభిమానుల్లో ఆందోళన నెలకొంది. కాగా, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వాచ్ మెన్ సహాయకుడు కోలుకుంటే, ఈ కేసులో కీలక వివరాలు లభ్యం కాగలవని పోలీసులు భావిస్తున్నారు.