: పాపం బెంగళూరు! ఐపీఎల్ చరిత్రలోనే అత్యల్ప స్కోరు నమోదు.. కోల్‌కతా చేతిలో చిత్తుచిత్తుగా ఓటమి!
పాపం బెంగళూరు! ఐపీఎల్ అభిమానులందరూ ఇప్పుడిదే అనుకుంటున్నారు. హేమాహేమీలు ఉన్న ఆ జట్టు ఆదివారం రాత్రి కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 49 పరుగులకే కుప్పకూలి ఐపీఎల్ చరిత్రలోనే అత్యల్ప స్కోరు నమోదు చేసి రికార్డులకెక్కింది. కోల్‌కతా విధించిన 132 పరుగుల స్వల్ప విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన రాయల్ చాలెంజర్స్ కేవలం 49 పరుగులు చేసి భారీ పరాజయాన్ని మూటగట్టుకుంది.
తొలుత బ్యాటింగ్ చేసిన కోల్‌కతా నైట్‌రైడర్స్.. బెంగళూరు బౌలర్ చాహల్ (4-0-16-3) దెబ్బకు 19.3 ఓవర్లలో 131 పరుగులకు ఆలౌట్ అయింది. లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన బెంగళూరుకు కోల్‌కతా బౌలర్లు చుక్కలు చూపించారు. వరుస ఓవర్లలో కోహ్లీ (0), డివిల్లీర్స్ (8), కేదార్ జాదవ్ (9)లను పెవిలియన్ పంపిన కల్టర్‌నైల్.. కోహ్లీ సేనను కోలుకోలేని దెబ్బకొట్టాడు. దీంతో 24 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి బెంగళూరు పీకల్లోతు కష్టాల్లో పడింది.
క్రిస్‌గేల్ (7) క్రీజులో కుదురుకున్నట్టు కనిపించడంతో బెంగళూరు ఆశలు సజీవంగా నిలిచాయి. అయితే ఏడో ఓవర్లో బంతి తీసుకున్న క్రిస్ వోక్స్ గేల్, బిన్నీలను వెంటవెంటనే వెనక్కి పంపడంతో బెంగళూరు పని అయిపోయింది. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన వపన్ నేగి (2), బద్రీ (0), మిల్స్ (2), చాహల్ (0)లు కూడా తక్కువ స్కోరుకే పెవిలియన్ చేరడంతో జట్టు మొత్తం కలిసి అర్ధ సెంచరీ కూడా పూర్తిచేయలేకపోయింది. ఫలితంగా ఘోర పరాభవాన్ని మూటకట్టుకుంది.
అంతకు ముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా నైట్ రైడర్స్ ఓపెనర్ సునీల్ నరైన్ (17 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్‌తో 34 పరుగులు) తొలి ఓవర్లోనే రెచ్చిపోయాడు. గంభీర్ (14)తో కలిసి తొలి వికెట్‌కు 48 పరుగులు జోడించి మాంచి ఊపుమీద ఉన్నట్టు కనిపించాడు. అయితే తర్వాత స్వల్ప వ్యవధిలోనే వీరిద్దరూ ఔటవడంతో జట్టు కష్టాల్లో పడింది. తర్వాత వచ్చిన ఊతప్ప(11), యూసఫ్ పఠాన్ (8), మనీష్ పాండే (15), గ్రాండ్ హోమ్ (0) కూడా తక్కువ పరుగులకే ఔటవడంతో కోల్‌కతా 19.3 ఓవర్లలో 131 పరుగులకే కుప్పకూలింది.