: భార్య ఫిర్యాదు మేరకు చిత్తూరు జిల్లా ఎస్ఐ అరెస్టు
చిత్తూరు జిల్లాలో ఎస్ఐగా పని చేస్తున్న శివకుమార్ ను ఆయన భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు అరెస్టు చేశారు. ఈ విషయాన్ని అనంతపురం జిల్లా హిందూపురం వన్ టౌన్ ఎస్ఐ దిలీప్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన తెలిపిన వివరాలు.. అనంతపురం జిల్లా గుడిబండ పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా పని చేస్తున్న నగీనాను శివకుమార్ గతంలో ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కళాశాలలో వీళ్లిద్దరూ కలిసి చదువుకునే సమయంలో వారి ప్రేమ వ్యవహారం మొదలైంది. శివకుమార్ కు ఎస్ఐ ఉద్యోగం వచ్చిన తర్వాత నగీనాతో ప్రేమకు స్వస్తి చెప్పాలనుకున్నాడు.
అయితే, అప్పట్లో అక్కడ పని చేసిన ఎస్పీ కౌన్సెలింగ్ ఇవ్వడంతో ఆమెను పెళ్లి చేసుకున్నాడు. కానీ, అతని ప్రవర్తనలో మాత్రం ఎటువంటి మార్పు రాలేదు. మరోపెళ్లి చేసుకునే ప్రయత్నాల్లో ఉన్నాడని బాధితురాలు నగీనా గత డిసెంబర్ లో హిందూపురంలో తమకు ఫిర్యాదు చేసినట్టు ఎస్ఐ దిలీప్ కుమార్ చెప్పారు. ఈ మేరకు శివకుమార్ ను అరెస్టు చేసి, కోర్టుకు హాజరుపరచగా రిమాండ్ విధించినట్టు తెలిపారు.