: ధోనీ దుమ్ము లేపడంతో పూణె టీమ్ ఓనర్ కు దిమ్మతిరిగింది.. ఆయనకు అద్దం గిఫ్ట్ గా ఇవ్వాలన్న రాయుడు


'అడవికి రారాజు స్మిత్' అంటూ ధోనీని కించపరుస్తూ పూణె టీమ్ ఓనర్ కామెంట్ చేసిన సంగతి తెలిసిందే. ఆయన చేసిన వ్యాఖ్యల పట్ల ఎంతో మంది క్రికెట్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో, నిన్న హైదరాబాద్ సన్ రైజర్స్ తో జరిగిన మ్యాచ్ లో ధోనీ విశ్వరూపం ప్రదర్శించాడు. మ్యాచ్ ను గెలవాలంటే మూడు ఓవర్లలో 47 పరుగులు చేయాల్సిన తరుణంలో... తనదైన శైలిలో మ్యాచ్ ను ఫినిష్ చేశాడు ధోనీ. కేవలం 34 బంతుల్లో 61 పరుగులు చేసి తన జట్టుకు ఘన విజయాన్ని అందించాడు.

దీంతో, పూణె టీమ్ ఓనర్ సంజీవ్ గోయంకా యూటర్న్ తీసుకున్నాడు. ఏ నోటితో అయితే ధోనీపై విమర్శలు చేశాడో... అదే నోటితో ఇప్పుడు జార్ఖండ్ డైనమైట్ ను పొగుడుతున్నాడు. ధోనీ ఫామ్ లోకి రావడం చాలా సంతోషంగా ఉందని... మ్యాచ్ ను ఫినిష్ చేయడంలో ధోనీకి మించిన మొనగాడు లేడంటూ ట్వీట్ చేశాడు.

గోయెంకా ట్వీట్ పై ముంబై ఇండియన్స్ ఆటగాడు అంబటి రాయుడు కౌంటర్ ఇచ్చాడు. అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడంటూ ధోనీకి కితాబిచ్చిన రాయుడు... గోయెంకాకు ఎవరైనా ఓ అద్దాన్ని బహుమతిగా ఇవ్వాలంటూ ట్వీట్ చేశాడు. 'మిస్టర్ గోయెంకా! నీ మొహం అద్దంలో చూసుకో' అని ఇన్ డైరెక్ట్ గా రాయుడు కామెంట్ చేశాడు.

  • Loading...

More Telugu News