: మే 11న టీడీపీలో చేరనున్న డోన్ వైసీపీ నేత సుబ్బారెడ్డి
మరో వైసీపీ నేత టీడీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. కర్నూలు జిల్లా డోన్ నియోజకవర్గంలో వైసీపీ నేతల మధ్య విభేదాలు తార స్థాయికి చేరుకున్నాయి. ఎమ్మెల్యే బుగ్గన రాజారెడ్డితో ఏపీఐడీసీ మాజీ డైరెక్టర్ ధర్మవరం సుబ్బారెడ్డికి విభేదాలు ఉన్నాయి. వీరిద్దరి మధ్య సయోధ్య కుదిర్చేందుకు ఒకానొక సమయంలో వైసీపీ అధినేత జగన్ కూడా ప్రయత్నించారు. కానీ ఆయన ప్రయత్నాలు సఫలం కాలేదు.
ఈ క్రమంలో, ఇరు నేతల మధ్య అగాధం మరింత పెరిగింది. రెండు రోజుల క్రితం నియోజకవర్గ టీడీపీ ఇన్ ఛార్జ్ కేఈ ప్రతాప్ తో సుబ్బారెడ్డి కర్నూలులో చర్చలు జరిపారు. టీడీపీలో చేరితే సముచిత స్థానం కల్పిస్తామని ఈ సందర్భంగా సుబ్బారెడ్డికి కేఈ హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో, మే 11వ తేదీన డోన్ పాత బస్టాండు వద్ద భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి, టీడీపీలో చేరాలని సుబ్బారెడ్డి నిర్ణయించారు.