: ఏపీ పోలీసులపై తమిళనాడు రౌడీల దాడి!
ఆంధ్రప్రదేశ్ పోలీసులపై తమిళనాడు రౌడీమూకలు దాడి చేసిన ఘటన నిన్న చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే, 2009లో గుంటూరు జిల్లా పిడుగురాళ్లలో ఓ మహిళ కిడ్నాప్ కు సంబంధించి మదన్ రెడ్డి అనే వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అప్పటి నుంచి అతను పరారీలో ఉన్నాడు. ఈ నేపథ్యంలో గత వారం అతనికి కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది.
ఈ క్రమంలో, మదన్ రెడ్డి తమిళనాడులోని అరక్కోణం ప్రాంతంలో ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. దీంతో, అతడిని అదుపులోకి తీసుకునేందుకు హెడ్ కానిస్టేబుల్ శ్యాంసన్ ఆధ్వర్యంలో మరో ముగ్గురు కానిస్టేబుళ్లు అక్కడకు వెళ్లారు. అతడిని అరెస్ట్ చేసి, ఓ అద్దె కారులో వస్తుండగా నిన్న రాత్రి 8 గంటల సమయంలో తిరుత్తణి సమీపంలోని చెన్నై, తిరుపతి జాతీయ రహదారిపై కొందరు దుండగులు వారిపై దాడి చేశారు. కారు అద్దాలను ధ్వంసం చేసి, వీరిపై అటాక్ చేశారు. అనంతరం మదన్ రెడ్డిని తీసుకుని పారిపోయారు. గాయపడిన పోలీసులను స్థానికులు తిరుత్తణి ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై ఏపీ పోలీసులు తిరుత్తణి పోలీసులకు ఫిర్యాదు చేశారు.