: ఆటో డ్రైవర్ నిజాయితీ.. ఆటోలో దొరికిన ఐదు తులాల బంగారు గొలుసు అప్పగింత!


ఆటోలో పడిపోయిన ప్రయాణికురాలి బంగారు గొలుసును తీసుకెళ్లి ఆమెకు అప్పగించి నిజాయతీ చాటుకున్నాడో ఆటో డ్రైవర్. హైదరాబాద్‌లో జరిగిందీ ఘటన. నగరంలోని అల్మాస్‌గూడకు చెందిన ఎం.ప్రియాంక (28) శుక్రవారం సాయంత్రం సైదాబాద్ వెళ్లేందుకు మల్లేశ్ ఆటో ఎక్కి మల్లమ్మ చౌరస్తా వద్ద దిగింది. అక్కడి నుంచి మరో ఆటోలో సైదాబాద్ వెళ్లింది. సైదాబాద్ చేరుకున్నాక తన మెడలోని గొలుసు మాయమైందన్న సంగతి గమనించిన ప్రియాంక వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది.

శనివారం ఉదయం ఆటో శుభ్రం చేస్తున్న మల్లేశ్‌కు సీటులో ఇరుక్కుపోయిన ఐదు తులాల బంగారు గొలుసు కనిపించింది. దీంతో ఆయన దానిని తీసుకెళ్లి మీర్‌పేట పోలీస్ స్టేషన్‌లో అప్పగించాడు. అప్పటికే గొలుసు పోయిన ఫిర్యాదు ఉండడంతో ఎస్సై లక్ష్మణ్‌రెడ్డి ప్రియాంకను పిలిపించారు. స్టేషన్‌కు వచ్చిన ఆమెను గుర్తుపట్టిన మల్లేశ్ చేతుల మీదుగా ఎస్సై ఆ గొలుసును ఆమెకు అందజేశారు. పోయిన గొలుసు దొరికిన ఆనందంలో ఆటో డ్రైవర్ మల్లేశ్‌కు ప్రియాంక రూ.3 వేలు ఇచ్చింది. నిజాయతీ చాటుకున్న మల్లేశ్‌ను పోలీసులు అభినందించారు.

  • Loading...

More Telugu News