: ఈ విషయం తెలుసా?.. వందేళ్ల క్రితమే హైదరాబాద్‌లో నోట్ల రద్దు!


గతేడాది నవంబరు 8న మోదీ ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేసిన విషయం అందరికీ తెలుసు. గతంలో జనతా ప్రభుత్వం కూడా పెద్ద నోట్లను రద్దు చేసిన విషయం కొందరికి తెలుసు. కానీ వందేళ్ల క్రితమే హైదరాబాద్‌లో నోట్ల రద్దు అయ్యాయన్న విషయం ఎందరికి తెలుసు? అప్పట్లో నిజాం నవాబు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ కొత్త నోట్లను విడుదల చేసి ఆ తర్వాత వాటిని రద్దు చేశారు. ఆర్థికంగా బలంగా ఉండే నిజాం సంస్థానంలోని కోశాగారం బంగారు, వెండి నాణేలతో ఎప్పుడూ కళకళలాడేది. అయితే రెండు ప్రపంచ యుద్ధాల్లో నిజాం రాజు బ్రిటిష్ ప్రభుత్వానికి మద్దతుగా నిలిచారు. దీంతో నవంబరు 11, 1918న మొదటి ప్రపంచ యుద్ధం ముగిసే నాటికి సంస్థానం తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయింది.

దీంతో ఆర్థిక పరిస్థితిని తిరిగి గాడిలోకి తెచ్చేందుకు బంగారు నాణేలైన హోలీ సిక్కాలను కానీ, వెండి నాణేలను కానీ ముద్రించాలనుకున్నారు. అయితే యుద్ధాల కారణంగా ఆర్థికంగా క్షీణించిపోవడంతో 1919లో తొలిసారిగా రూపాయి విలువైన కరెన్సీ నోట్లను సంస్థానంలో ముద్రించి చలామణిలోకి తెచ్చారు. అయితే ఇవి నల్లగా ఉండడంతో అంతగా శుభసూచకం కాదని, వాటిని ఉపసంహరించుకోవాలని సంస్థానంలోని ఉద్యోగులు, ఆర్థిక రంగ నిపుణులు చెప్పినా నిజాం నవాబు వినిపించుకోలేదు. మరోవైపు నోట్లు నల్లగా ఉండడంతో వాటిని తీసుకునేందుకు ప్రజల నుంచి కూడా వ్యతిరేకత వ్యక్తమైంది. చివరికి ఉస్మానియా అధ్యాపకుల సూచనతో నిజాం ఆ నోట్లను రద్దు చేశారని ప్రముఖ చరిత్రకారుడు జబ్బార్‌ వివరించారు.  హైదరాబాద్ సంస్థానం ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకున్నా ఆ ప్రభావం యూనివర్సిటీపై పడలేదని ఆయన పేర్కొన్నారు. రెండో ప్రపంచ యుద్ధం ప్రారంభమైన రెండు నెలలలో డిసెంబరు 4, 1939న ఆర్ట్స్ కాలేజీ  భవనాన్ని నిజాం నవాబు ప్రారంభించారని  జబ్బార్ పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News