: జనసేన పొలిటికల్ ఎంట్రెన్స్ టెస్టుకు భారీ స్పందన
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ అనంతపురం జిల్లాలో తలపెట్టిన పార్టీ నియామకాలకు భారీ స్పందన వచ్చింది. వివిధ విభాగాల్లో చేరి పార్టీకి సేవలు అందించేందుకు 4,500 మంది దరఖాస్తులు చేసుకున్నారు. అనంతపురంలో జనసేన ఎగ్జామ్ టెస్టు జరగనుండగా, వ్యాఖ్యాత విభాగానికి 3,800 మంది, విశ్లేషకుల, రచయితల విభాగానికి 700 మంది దరఖాస్తు చేసినట్టు పార్టీ వర్గాలు వెల్లడించాయి. క్షేత్ర స్థాయిలో జనసేన బలోపేతానికి ప్లాన్ వేసిన పవన్ కల్యాణ్, వీరందరికీ పరీక్ష, ఇంటర్వ్యూలు నిర్వహించి, ఆపై నియామకాలు చేపట్టేందుకు నిపుణులతో కూడిన కమిటీని నియమించారు. నియామకాలు పూర్తయిన తరువాత త్వరలోనే పార్టీ తొలి కార్యాలయాన్ని అనంతలో పవన్ స్వయంగా ప్రారంభిస్తారని వెల్లడించారు.