: రాజమౌళి గారూ! కన్నడలో మాట్లాడితే సరిపోతుందా?....కట్టప్పతో క్షమాపణలు చెప్పించండి: కన్నడ సంఘం నేత


'బాహుబలి-2 ది కన్ క్లూజన్' సినిమా విడుదలను అడ్డుకోవడం సరికాదని, సత్యరాజ్ ఈ సినిమా దర్శకుడు కానీ నిర్మాత కానీ కాదని, కేవలం నటుడు మాత్రమేనని చెబుతూ దర్శకుడు రాజమౌళి కన్నడలో విడుదల చేసిన రికార్డెడ్ వీడియోపై కన్నడ ధళవళపార్టీ నాయకుడు వాటాళ్ నాగరాజు స్పందించారు. చిత్రదుర్గలో ఆయన మాట్లాడుతూ, సత్యరాజ్ క్షమాపణలు చెప్పే వరకు 'బాహుబలి 2' సినిమా విడుదలకు కన్నడనాట సహకరించమని అన్నారు. తమ పోరాటం బాహుబలి సినిమాపై కాదని ఆయన స్పష్టం చేశారు. తమ పోరాటం సత్యరాజ్ మీద అని, కన్నడిగులను అపహాస్యం చేసిన సత్యరాజ్ నటించిన సినిమాలు కన్నడంలో విడుదల జరగదని ఆయన తెలిపారు.

రాజమౌళి కన్నడలో మాట్లాడినంతమాత్రాన సరిపోదని, సత్యరాజ్ తో క్షమాపణలు చెప్పించాలని ఆయన సూచించారు. ఈ విషయంలో సాక్షాత్తూ బ్రహ్మదేవుడే వచ్చినా తమ నిర్ణయం మారదని ఆయన స్పష్టం చేశారు. తమ నిర్ణయానికి కన్నడ సినీ పరిశ్రమ మద్దతు కూడా ఉందని ఆయన తెలిపారు. ఈ నెల 21న సత్యరాజ్ శవయాత్ర నిర్వహిస్తామని తెలిపినట్టుగా చిక్ బళ్లాపూర్ లోని శిడ్లఘట్ట సర్కిల్ లో సత్యరాజ్ దిష్టిబొమ్మ శవయాత్ర నిర్వహించారు. ఈనెల 28న బంద్ జరుగుతుందని, 'బాహుబలి 2' విడుదల అడ్డుకుంటామని ఆయన తెలిపారు. 

  • Loading...

More Telugu News