: ట్రంప్ నిబంధనల ఎఫెక్ట్ మొదలు... 2 వేల మందిని తొలగిస్తున్నట్టు ప్రకటించిన విప్రో!


అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకువస్తున్న వీసా నిబంధనల కఠినం ప్రభావం భారత ఐటీ కంపెనీలపై పడింది. దేశీయ ఐటీ దిగ్గజం విప్రో, వందల మందిని ఉద్యోగం నుంచి తొలగించింది. ఎంతమందిని తొలగించారన్న విషయమై స్పష్టమైన ప్రకటన లేకపోయినప్పటికీ, ఇంటికి చేరిన ఉద్యోగుల సంఖ్య 2 వేలకు పైగానే ఉన్నట్టు తెలుస్తోంది. కంపెనీ భవిష్యత్ లక్ష్యాలు, వ్యూహాత్మక ప్రాధాన్యతలు, క్లయింట్ల అవసరాల మేరకు ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని, పనితీరు మదింపు తరువాతే, సంతృప్తి కలిగించని ఉద్యోగులనే తొలగించామని పేర్కొంది.

తొలగించబడ్డ వారిలో అత్యధికులు అమెరికాలో పని చేస్తున్న వారేనని సమాచారం. కాగా, ప్రతి సంవత్సరం పెర్ ఫార్మెన్స్ రివ్యూలు సహజమేనని, పనితీరు మెరుగుపడని వారిని తొలగించడం సాధారణమేనని సంస్థ అధికారి ఒకరు తెలిపారు. ఆటోమేషన్, క్లౌడ్ కంప్యూటింగ్ పెరుగుతూ ఉండటం, పలు దేశాల వీసా నిబంధనలు కఠినం కావడం తదితర కారణాలతో మిగతా ఐటీ కంపెనీలు సైతం విప్రో బాటలోనే నడవనున్నాయని నిపుణులు భావిస్తున్నారు.

  • Loading...

More Telugu News