: చదువు రాదని ఎంపీపీని వెక్కిరించిన శిల్పా భువనేశ్వరరెడ్డి... వెక్కి వెక్కి ఏడ్చిన నాగమణి!
కర్నూలు జిల్లా ఎం.తిమ్మాపురంలోని ఏపీ మోడల్ స్కూల్లో విద్యార్థినులకు సైకిళ్ల పంపిణీ కార్యక్రమంలో టీడీపీ ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణిరెడ్డి బంధువు, టీడీపీ నేత శిల్పా భువనేశ్వరరెడ్డి చేసిన వ్యాఖ్యలతో మహానంది ఎంపీపీ చింతం నాగమణి కన్నీరుమున్నీరయ్యారు. ఏపీ మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ ఫర్హానా బేగం బాగా చదువుకున్నారని, అందువల్లే ఆంగ్లంలో మాట్లాడుతున్నారని చెప్పిన శిల్పా, నాగమణి చదువుకోనందువల్లే సరిగ్గా మాట్లాడటం లేదని వ్యాఖ్యానించారు.
"మీ ప్రిన్సిపల్ మేడమ్ చదువుకుంది. ఇంగ్లిష్లో మాట్లాడుతుంది. ఎంపీపీ చదువుకోలేదు. సరిగా మాట్లాడలేదు" అని అనడంతో, దీన్ని అవమానంగా భావించిన నాగమణి, వెంటనే అక్కడి నుంచి ఏడుస్తూ బయటకు వెళ్లిపోయారు. జరిగిన ఘటనపై నాగమణి భర్త క్రాంతికుమార్ మాట్లాడుతూ, ఏ పదవీ లేని శిల్పా, ఈ సభకు ఎలా వచ్చారని ప్రశ్నించారు. తన భార్య 2006లోనే ఇంటర్ పూర్తి చేసిందని, చిన్న వయసులోనే రాజకీయాల్లోకి రావడంతోనే స్టేజీలపై మాట్లాడేందుకు ఆమె భయపడుతూ ఉంటుందని అన్నారు.