: ఆవు కళేబరంలోకి విషాన్ని ఎక్కించారు.. చిరుత పులులకు ఎరగా వేసి చంపేశారు!
పశ్చిమ బెంగాల్‌లోని బీర్పార టీ ఎస్టేట్‌లో కొందరు దుండగులు కలకలం రేపారు. ఆ ప్రాంతంలో రెండు చిరుతపులులపై విషప్రయోగం చేసి వాటిని చంపేశారు. ఈ సమాచారం అందుకుని అక్కడకు చేరుకున్న పోలీసులకి అక్కడ చిరుత పులుల మృతదేహాలతో పాటు మృతి చెందిన ఆవు శరీర భాగాలు కూడా కనిపించాయి. దుండగులు ఆవు కళేబరంలోకి విషాన్ని ఎక్కించి, వాటిని చిరుత పులులు తినేలా చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఆవుల శరీర భాగాలు విషంతో ఉండడంతోనే పులులు చనిపోయినట్లు గుర్తించారు.
ఆవు, పులుల కళేబరాలను పోలీసులు పరీక్షల నిమిత్తం అక్కడి నుంచి తరలించారు. దుండగులు ఈ ఘటనకు ఎందుకు పాల్పడ్డారన్న అంశంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఆ ప్రాంతంలో ఆవులపై చిరుత పులులు దాడి చేయడంపై ఆగ్రహంతో ఉన్న పలువురు వ్యక్తులే ఈ చర్యకు పాల్పడ్డారా? అన్న కోణంలోనూ పోలీసులు ఆరా తీస్తున్నారు. అయితే, ఇటువంటి చర్యలు ఇలాగే కొనసాగితే ప్రమాదమేనని అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు.