: మరో ఏడాదిన్నర పాటు వడ్డీ రేట్లు తగ్గబోవు!
ఇండియాలో వివిధ అవసరాల నిమిత్తం బ్యాంకు రుణాలు తీసుకుని, నెలవారీ కిస్తీలు చెల్లిస్తున్న వారికి ఇది కొంత దుర్వార్తే. వచ్చే ఏడాదిన్నర కాలం పాటు వడ్డీ రేట్లను సవరిస్తూ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్ణయం తీసుకోకపోవచ్చని, వడ్డీ రేట్లు ఇప్పుడున్న స్థితిలోనే కొనసాగుతాయని ఆర్థికవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఈ నెల 10 నుంచి 19 మధ్య 35 మంది ఆర్థిక వేత్తలను భాగం చేస్తూ, ఓ పోల్ నిర్వహించగా, 2018 మార్చి వరకూ రెపో రేటు 6.25 శాతం వద్దే ఉంటుందని, రివర్స్ రెపో రేటు కూడా మారబోదని అత్యధికులు తెలిపారు. పెరుగుతున్న ద్రవ్యోల్బణం ఆర్బీఐకి అడ్డుగా నిలిచి సవాళ్లు ఎదురయ్యేలా చేస్తోందని, వ్యవస్థలో నగదు లభ్యత సంతృప్తికరంగా లేకపోవడంతో ఆర్బీఐ ముందు వడ్డీ రేటు తగ్గించే లేదా పెంచే అవకాశాలు లేవని క్రిసిల్ ఎకానమిస్ట్ ధర్మకీర్తి జోషి అంచనా వేశారు. అక్టోబర్ 2016 తరువాత ఇన్ ఫ్లేషన్ వేగవంతంగా పెరుగుతున్న సంకేతాలను చూపిందని ఇప్పటికే ఆర్బీఐ నిర్దేశించుకున్న 4 శాతానికి దగ్గరగా వచ్చిన ద్రవ్యోల్బణం, 5 శాతం వరకూ పెరిగే ప్రమాదముందని ఆర్థిక వేత్తలు భావిస్తున్నారు.