: ఎవరి రాష్ట్రంలో వున్నవి వారే తీసుకోండి.. స్థిర, చరాస్తులపై ఏపీ, తెలంగాణలకు క్లారిటీ ఇచ్చిన కేంద్రం!


విభజన అనంతరం అపరిష్కృతంగా మిగిలిపోయిన ఆస్తుల పంపకం విషయంలో ఏపీ, తెలంగాణలకు కేంద్రం క్లారిటీ ఇచ్చింది. ఏ రాష్ట్రంలో ఉన్నవి వారికే చెందుతాయని, అదే ప్రాతిపదికన పంచుకోవాలని ఆదేశించింది. భూములు, గిడ్డంగులు, సామగ్రి, ఇతర వస్తువులను ఎక్కడున్నవి అక్కడి వారు తీసేసుకోవాలని, నగదు నిల్వలు, ఫిక్స్‌డ్ డిపాజిట్లు, బ్యాంకు ఖాతాల్లోని నిల్వలను మాత్రం జనాభా ప్రాతిపదికన పంచుకోవాలని సూచించింది.

ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలి కేసులో మార్చి 18, 2016న సుప్రీంకోర్టు తీర్పు ఇస్తూ ఆస్తులను ఇరు రాష్ట్రాలు జనాభా ప్రాతిపదికన 58:42 నిష్పత్తిలో పంచుకోవాలని ఆదేశించింది. అయితే ఈ విషయంలో ఇరు రాష్ట్రాలు సమ్మతించకపోతే కేంద్రం జోక్యం కోరవచ్చని స్పష్టం చేసింది. ఆ తర్వాత రెండు నెలల్లోపు ఓ కమిటీ వేసి సమస్య పరిష్కారానికి కృషి చేయాలని ఆదేశించింది. సుప్రీం తీర్పు నేపథ్యంలో ఏపీ నుంచి ఈ విషయంలో వినతి అందడంతో కేంద్రం కమిటీని ఏర్పాటు చేసింది. రెండు రాష్ట్రాల నుంచి ఇద్దరు సభ్యులను నియమించింది.

అయితే, గతేడాది అక్టోబరు 18న జరిగిన చర్చల్లో పరిష్కారం కుదరలేదు. దీంతో ఇరు రాష్ట్రాలు తమ వాదనలను పది రోజుల్లో లిఖితపూర్వకంగా తెలియజేయాలని సూచించింది. ఈ క్రమంలో బుధవారం కేంద్ర హోంశాఖ అదనపు కార్యదర్శి జైదీప్ గోవింద్ తుది ఆదేశాలు జారీ చేసి వాటిని ఏపీ, తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు పంపించారు. విభజన చట్టంలోని సెక్షన్ 48 (1), సెక్షన్ 48 (4) ప్రకారం స్థిర, చరాస్తులు ఏ రాష్ట్రంలో ఉంటే అవి వారికే చెందుతాయని, అదే ప్రాతిపదికన పంచుకోవాలని అందులో పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News