: కూల్‌డ్రింక్‌లో వ్యర్థాలు.. చిరు వ్యాపారితో కస్టమర్ల గొడవ
ఎండవేడిని తట్టుకొని కాస్త ఉపశమనం పొందడానికి శీతల పానీయాలను ఆశ్రయించే ప్రజలకు అందులో వ్యర్థాలు ఉంటున్నాయన్న భయం పట్టుకుంటోంది. అనంతపురం జిల్లాలోని పెనుకొండలో ఇటువంటి ఘటనే చోటు చేసుకుంది. ఆ ప్రాంతంలోని ఆర్టీసి బస్టాండ్ వెనుక వీధిలో రహంతుల్లా అనే వ్వక్తి చిరు వ్యాపారి వద్ద కూల్ డ్రింకులు తీసుకున్న ప్రజలకు అందులో వ్యర్థాలు కనిపించాయి. అక్కడే బస్టాండ్, బాబయ్య స్వామి దర్గా ఉండడంతో రహంతుల్లా వద్ద భారీగానే కూల్ డ్రింక్స్ అమ్ముడుపోతుంటాయి. అయితే, ఈ రోజు ఆయన వద్ద తీసుకున్న కూల్ డ్రింకుల్లో వ్యర్థాలు కనిపించడంతో రహంతుల్లాతో కస్టమర్లు గొడవకు దిగారు.
కాలం చెల్లిన కూల్ డ్రింక్స్‌ను అమ్ముతూ ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే, తాను అటువంటి చర్యలకు పాల్పడలేదని రహంతుల్లా చెప్పాడు. అనంతరం స్థానిక డీలర్ నీసార్ అహ్మద్ దృష్టికి ఈ విషయాన్ని రహంతుల్లా తీసుకెళ్లగా దీనిపై అతను స్పందించలేదు. కూల్ డ్రింకులో వస్తోన్న వ్యర్థాల వల్ల తన వ్యాపారం దెబ్బతింటుందని వాపోతున్నాడు. ఎండాకాలం కావడంతో ప్రజలు కూల్ డ్రింకులను అధికంగా ఆశ్రయిస్తుంటారు. ఇటువంటి నేపథ్యంలో వాటిల్లో వ్యర్థాలు కనిపిస్తుండడం ఆందోళన కలిగిస్తోంది.