: ఇకపై వీవీఐపీలకు ఎర్రబుగ్గ కార్లు ఉండవు.. నిషేధం విధిస్తూ కేంద్రం ఉత్తర్వులు!
వీవీఐపీల సంప్రదాయానికి కేంద్ర ప్రభుత్వం చరమగీతం పాడనుంది. వీవీఐపీల వాహనాలపై ఎర్రబుగ్గల వాడకాన్ని నిషేధిస్తూ కేంద్ర ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులు మే 1 నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ ఉత్తర్వుల ప్రకారం, రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, ప్రధాన మంత్రి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, లోక్ సభ స్పీకర్ సహా వీవీఐపీలెవ్వరూ బుగ్గ కార్లను వినియోగించేందుకు వీల్లేదు. కాగా, కేబినెట్ మంత్రులు, న్యాయమూర్తులు, తదితర వీఐపీలకు కూడా బుగ్గ కార్ల సౌకర్యం ఇప్పటి వరకు ఉంది. గత ఏడాదిన్నర కాలంగా ఈ నిర్ణయం కేంద్రం పరిశీలనలో ఉంది. అయితే, ఢిల్లీలో ఆప్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పార్టీ మంత్రులు ఎవ్వరూ ఎర్రబుగ్గ కార్లు వాడకుండా నిషేధాన్ని విధిస్తూ మొట్టమొదట నిర్ణయం తీసుకుంది. యూపీలో యోగి ఆదిత్యనాథ్ సర్కారు, పంజాబ్ లో అమరీందర్ సింగ్ ప్రభుత్వం కూడా ఎర్రబుగ్గ కార్ల వాడకాన్ని నిషేధిస్తూ నిర్ణయం తీసుకున్నాయి.