: అహర్నిశలు కష్టపడుతున్న చంద్రబాబుకు అండగా నిలవాలి: నారా లోకేశ్
ప్రజల కోసం, వారి సంక్షేమం కోసం అహర్నిశలు కష్టపడుతున్న సీఎం చంద్రబాబు నాయుడుకి ప్రజలందరూ అండగా నిలవాలని ఏపీ పంచాయతీరాజ్, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ అన్నారు. తూర్పుగోదావరి జిల్లా కరప మండలంలో లోకేశ్ పర్యటిస్తున్నారు.ఈ సందర్భంగా రూ.12 కోట్ల నిధులతో రెండు చోట్ల నిర్మించిన సమగ్ర రక్షిత మంచినీటి పథకాలను ఆయన ప్రారంభించారు. అనంతరం లోకేశ్ మాట్లాడుతూ, రాష్ట్రాభివృద్ధికి టీడీపీ ప్రభుత్వం పాటుపడుతుంటే ప్రతిపక్షం, వారి పత్రిక తమపై బురదజల్లేందుకు ప్రయత్నిస్తోందని విమర్శించారు. ప్రతిపక్షాలు చేస్తున్న నిరాధార ఆరోపణలను ప్రజలు తిప్పికొట్టాలని లోకేశ్ పిలుపు నిచ్చారు. గ్రామాలను అభివృద్ధి చేసేందుకే తాను పంచాయతీ రాజ్ శాఖను తీసుకున్నానని అన్నారు. డ్వాక్రా మహిళలకు ఇప్పటికే రూ.6 వేల కోట్లు ఇచ్చామని, మరో రూ.4 వేల కోట్లు త్వరలోనే చెల్లించనున్నామని తెలిపారు. కాగా, ఈ సందర్భంగా వేళంగి గ్రామానికి చెందిన సుమారు వంద మంది వైఎస్సార్సీపీ కార్యకర్తలు టీడీపీలో చేరారు.