: ఏమయ్యా... అసెంబ్లీలో మీరే... ఇక్కడ కూడా మీరేనా?: జేసీ


టీడీపీ ఎంపీ జేసీ దివాకరరెడ్డి ఎక్కడుంటే అక్కడ సందడి సందడిగా ఉంటుంది. ఆయన నోటి నుంచి ఎలాంటి సంచలన వ్యాఖ్యలు వెలువడతాయో అనే ఆసక్తి నెలకొంటుంది. నిన్న అనంతపురం జిల్లాపరిషత్ సర్వసభ్య సమావేశంలో సైతం జేసీ తనదైన శైలిలో అందర్నీ నవ్వించారు. సమావేశ మందిరంలోకి జేసీ ప్రవేశించే సమయానికి ముందు వరుసలో కూర్చోవడానికి కుర్చీ లేకపోవడంతో ఆయన వెనుకకు వెళ్లారు. ఇంతలోనే అధికారులు వచ్చి... సార్, ముందు వరుసలో కూర్చోండి అని కోరారు. దీంతో, ఆయన ముందుకు వచ్చి, వైసీపీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి పక్కన కూర్చున్నారు.

ఆ సమయంలో తన నియోజకవర్గంలో తాగునీటి సమస్యలపై కదిరి ఎమ్మెల్యే చాంద్ బాషా మాట్లాడుతున్నారు. ఇంతలో జేసీ కలగజేసుకుని... "ఏమయ్యా... అసెంబ్లీలో మీరే మాట్లాడతారు... ఇక్కడ కూడా మీరేనా?" అంటూ ప్రశ్నించారు. "జడ్పీటీసీలకు మాట్లాడేందుకు అవకాశం ఇవ్వండి... నువ్వు కూర్చో" అన్నారు. అయితే, తన నియోజకవర్గ తాగునీటి సమస్యను జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లే క్రమంలో చాంద్ బాషా మాట్లాడుతూనే ఉన్నారు. దీంతో మరోసారి జేసీ స్పందిస్తూ... "వాళ్లకు అవకాశం ఇవ్వమంటే, నీవే మాట్లాడుతావ్" అంటూ కసురుకున్నారు. దీంతో, వెంటనే చాంద్ బాషా తన సమస్యను తెలపడాన్ని ముగించారు. అనంతరం మరో 3 నిమిషాల తర్వాత జేసీ సమావేశ మందిరం నుంచి వెళ్లి పోయారు. 

  • Loading...

More Telugu News