: 73 రూపాయలకే టెలినార్ బంపర్ ఆఫర్
టెలికాం సంస్థల మధ్యపోటీ వినియోగదారులను ఆనందంలో ముంచెత్తుతోంది. భారత్ లో వ్యాపార అవకాశాలు కొల్లగొట్టేందుకు టెలికాం సంస్థలు ఆఫర్లతో వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి. ప్రధానంగా భారత టెలికాం రంగంలో జియో సంచలనం మొదలైన తరువాత ఆఫర్ల పర్వం నడుస్తోంది. ప్రతి వారం ఏదో ఒక టెలికాం సంస్థ సరికొత్త ఆఫర్ తో వినియోగదారులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. తాజాగా టెలినార్ ఇండియా సంస్థ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సర్కిల్ లోని కొత్త 4జీ వినియోగదారులకు అపరిమిత డేటా ఆఫర్ ను ప్రకటించింది. సిమ్ తీసుకున్న కొత్త వినియోగదారులు మొట్టమొదటిసారిగా రీఛార్జ్ 73 రూపాయలతో చేయిస్తే 30 రోజుల కాలపరిమితితో అపరిమిత 4జీ/2జీ ఇంటర్నెట్ సర్వీసులు అందించనున్నట్టు ప్రకటించింది.
ఇందులో 90 రోజుల కాలపరిమితితో లోకల్, ఎస్టీడీ కాల్స్ కు కేవలం నిమిషానికి 25 పైసలు మాత్రమే ఛార్జ్ చేస్తామని టెలినార్ తెలిపింది. అలాగే ఈ సిమ్ కు లైఫ్ వ్యాలిడిటీ వస్తుందని, అదనంగా 25 రూపాయల టాక్ టైమ్ కూడా ఉంటుందని టెలినార్ తెలిపింది. ఈ సిమ్ తీసుకున్న వినియోగదారులు మొదటి 30 రోజుల తరువాత లేదా 120 రోజుల్లోపు 47 రూపాయలతో రీఛార్జ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుందని, అలా చేస్తే ఈ అన్ లిమిటెడ్ డేటా ఆఫర్ వర్తిస్తుందని టెలినార్ వెల్లడించింది.