: నీట్లోకి లాక్కెళ్లేందుకు మొసలి... ఒడ్డుకు తెచ్చేందుకు ఏనుగు... ఇది మరో గజేంద్ర మోక్షం...వీడియో చూడండి!
పోతనామాత్యుడు రచించిన భాగవతంలోని గజేంద్రమోక్షం గురించి తెలిసిందే.... అచ్చం అలాంటి ఘటనే మలావీలోని లివోండే జాతీయ పార్కులో చోటుచేసుకుంది. గజేంద్ర మోక్షంలో మడుగులో నీళ్లు తాగేందుకు వెళ్లిన ఏనుగు కాలిని మొసలి నోటకరుచుకోవడం.. ఏనుగు మొర విని .. శ్రీమహావిష్ణువు హుటాహుటీన వచ్చి దానిని రక్షించడం తెలిసిందే. అయితే ఇక్కడ ఏనుగుకు మరో ఏనుగు తోడు రావడంతో మొసలి పలాయనం చిత్తగించింది. లివోండే జాతీయ పార్కులో నీళ్లు తాగేందుకు మడుగులోకి ఏనుగుల గుంపు వెళ్లింది.
అందులో ఓ ఏనుగు నీళ్లు తాగేందుకు తొండాన్ని నీటిలో చాచగానే మాటువేసిన మొసలి దానిని పట్టుకుంది. దీంతో గజరాజు ఘీంకారం చేస్తూ దానిని వదిలించుకునే ప్రయత్నం చేసింది. అయితే మొసలి వదలకపోవడంతో దానిని పట్టుకుని ఒడ్డుకు తీసుకొచ్చేందుకు ఏనుగు ప్రయత్నించింది. దీనిని చూసిన మరో గజరాజు దాని దగ్గరకు వచ్చి ఓ చేయివేయబోయాడు. అంతే, మొసలి చిన్న ఏనుగును వదిలేసి వెళ్లిపోయింది. సోషల్ మీడియాలో దీనిని పోస్టు చేయగా, ఇది నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఆ వీడియో మీరు కూడా చూడండి.