: అవును...వారసత్వ ఉద్యోగాలు రాజ్యాంగవిరుద్ధమే: సింగరేణి కాలరీస్ కేసులో సుప్రీంకోర్టు
సింగరేణి కాలరీస్ లో వారసత్వ ఉద్యోగ వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు తెలంగాణ ప్రభుత్వానికి షాకింగ్ తీర్పు వెలువరించింది. వారసత్వ నియామకాలు రాజ్యాంగ విరుద్ధమంటూ గతంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ బొగ్గు గనుల కార్మిక సంఘం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిపై ఈరోజు విచారణ చేపట్టిన అత్యున్నత న్యాయస్థానం వారసత్వ నియామకాలు రాజ్యాంగ విరుద్ధమేనని స్పష్టం చేసింది.
దీంతో వలంటరీ రిటైర్మెంట్ (వీఆర్) ద్వారా తరువాత తరానికి ఉద్యోగాలు ఇచ్చే సంప్రదాయానికి గండిపడనుంది. కాగా, సింగరేణిలో చాలా కాలంగా వారసత్వ ఉద్యోగ వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. సింగరేణి ఉద్యోగులు చివరి దశలో వీఆర్ ద్వారా తమ పిల్లలను ఉద్యోగులుగా చేస్తున్నారని పలువురు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వారసత్వ ఉద్యోగాశావహులకు ఈ తీర్పు చెంపపెట్టుగా మారింది.