: ప్రేమ విఫలమై విషపు ఇంజక్షన్ తీసుకుని గుంటూరు డాక్టర్ ఆత్మహత్య


గుంటూరులోని పీపుల్స్ ట్రామా ప్రైవేటు ఆసుపత్రిలో పనిచేస్తున్న డాక్టర్ చైతన్య శరత్ చంద్ర అనే యువకుడు, పాయిజన్ ఇంజక్షన్ తీసుకుని ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. పోలీసుల ప్రాథమిక సమాచారం మేరకు, ప్రేమలో విఫలం కావడమే ఆత్మహత్యకు కారణమని సమాచారం. నిన్న రాత్రి నైట్ డ్యూటీ చేసిన చైతన్య తెల్లవారుజాము సమయంలో తన గదిలోకి వెళ్లారు.

ఆయన ఎంతకీ బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన ఆసుపత్రి సిబ్బంది, సహచర డాక్టర్లు, శరత్ ఉన్న తలుపులు బద్ధలు కొట్టి లోపలికి వెళ్లారు. అప్పటికే ఆయన చనిపోయినట్టు గమనించారు. పక్కనే రెండు ఖాళీ మత్తు ఇంజక్షన్లు ఉన్నాయి. మోతాదుకు మించి వాటిని తీసుకోవడంతోనే ఆయన మరణించినట్టు పోలీసులు వెల్లడించారు. పోస్టుమార్టం నిమిత్తం చైతన్య మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేశామని, విచారణ ప్రారంభించామని తెలిపారు.

కాగా, కొడుకు మృతదేహాన్ని చూసిన అతని తల్లి గుండెపోటుతో కుప్పకూలారు. అదే ఆసుపత్రిలో ప్రస్తుతం ఆమెకు అత్యవసర వైద్య చికిత్సను అందిస్తున్నారు. చైతన్య తండ్రి నరసరావుపేటలోని పోలీసు స్టేషన్ లో హెడ్ కానిస్టేబుల్ గా పని చేస్తున్నారు. చైతన్య గురించిన మరింత సమాచారాన్ని ఆయన బంధువుల నుంచి సేకరించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు.

  • Loading...

More Telugu News