: రిజర్వేషన్ల పెంపు బిల్లుకు టీఅసెంబ్లీ ఆమోదం
ముస్లిం, గిరిజన, బీసీ - ఈరిజర్వేషన్ల పెంపు బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం లభించింది. ఆదివారం అసెంబ్లీ ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ తో పాటు అధికార, విపక్ష సభ్యులు పలువురు తమ తమ అభిప్రాయాలను వెలిబుచ్చారు. అనంతరం, గిరిజనులకు 6 నుంచి 10 శాతం రిజర్వేషన్లు, బీసీ - ఈలకు 4 నుంచి 12 శాతం రిజర్వేషన్ల పెంపు బిల్లుకు ఆమోదం లభించింది. అంతకుముందు, సీఎం కేసీఆర్ మాట్లాడుతూ, గిరిజనుల రిజర్వుషన్ల పెంపు రాజ్యాంగం కల్పించిన హక్కు అని అన్నారు.
మతం పిచ్చిలో ఉండి ముస్లింలకు రిజర్వేషన్లు ఇవ్వొద్దనడం సరికాదని, వారికి ఎందుకు రిజర్వేషన్లు ఇవ్వకూడదని..వారేం పాపం చేశారని ప్రశ్నించారు. ఈ దేశంలో ముస్లింలు పౌరులు కాదా? వారు పన్నులు కట్టడం లేదా? అని ప్రశ్నించారు. పేదరికం, దారిద్ర్యం ఉన్నప్పుడు రిజర్వేషన్లు కోరడం సహజమని, బ్రిటిష్ కాలం నుంచే రిజర్వేషన్లు ఉన్నాయని అన్నారు. దళితుల రిజర్వేషన్ల గురించి మొదట మాట్లాడింది భాగ్యరెడ్డి వర్మనే అని అన్నారు. నిజాంను ఒప్పించి భాగ్యరెడ్డి వర్మ రిజర్వేషన్లను సాధించారని గుర్తు చేశారు. వాల్మీకి బోయలను ఎస్టీల్లో కలపొద్దని సీపీఎం నేతలు అనడం సరికాదని కేసీఆర్ అన్నారు.