: అరకు - విశాఖ రైలుకు విస్టాడమ్ కోచ్ ని ప్రారంభించిన సురేష్ ప్రభు
విశాఖ నుంచి అరకు వెళ్లే కిరండోల్ రైలు మార్గం.. ఈ మార్గంలో రైల్లో వెళుతుంటే ఆ అనుభూతే వేరు. చుట్టూ కొండలు, లోయలు, పచ్చటి వాతావరణం, అక్కడక్కడా గుహలు... ఇక వర్షాకాలంలో అయితే, చిన్న చిన్న జలపాతాలు, వేసవిలో కూడా చల్లటి వాతావరణం. రైల్లో ప్రయాణిస్తుంటే, టర్నింగుల్లో కిటికీల్లోంచీ కనిపించే రైలు ముందు బాగం, ఆపై పెద్ద పెద్ద వంతెనలపై నుంచి నెమ్మదిగా రైలు వెళుతుంటే ఓ రకమైన భయంతో లోయలోకి చూస్తూ మైమరచే ప్రయాణికులు... ఇదంతా ఓ ఎత్తయితే, ఇక నుంచి అరకు కొండల అందాలను మరింతగా కనువిందు చేస్తాయి. పూర్తి అద్దాలతో నిర్మించిన అత్యాధునిక విస్టాడమ్ కోచ్ అందుబాటులోకి వచ్చింది. ప్రయాణికులను మరింత అహ్లాదాన్ని అందించే ఈ కోచ్ లో ప్రయాణించడం అరుదైన అనుభూతిని మిగల్చనుంది.
ఈ కోచ్ ని కొద్దిసేపటి క్రితం రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభు భువనేశ్వర్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించగా, విశాఖ రైల్వే స్టేషనులో ఎంపీ గీత, ఎమ్మెల్యే బండారు తదితరులు పచ్చజెండా ఊపారు. రైలుకు ఈ కోచ్ ని కేటాయించినందుకు కృతజ్ఞతలు తెలిపిన ఎంపీ, సాధ్యమైనంత త్వరలో జోన్ ను కూడా ప్రకటించి, విశాఖ వాసుల చిరకాల వాంఛను తీర్చాలని గీత కోరారు.