: తిరిగి పార్లమెంట్ లోకి జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి... 10,775 ఓట్ల తేడాతో విజయం
జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా తిరిగి పార్లమెంటులోకి అడుగు పెట్టనున్నారు. తీవ్ర ఉద్రిక్తతల మధ్య చరిత్రలోనే అతి తక్కువ ఓటింగ్ నమోదైన శ్రీనగర్ లోక్ సభ ఉప ఎన్నికల్లో ఫరూక్, తన సమీప ప్రత్యర్థి, పీడీపీ అభ్యర్థి నజీర్ ఖాన్ పై 10,775 ఓట్ల తేడాతో విజయం సాధించారు. 9వ తేదీన జరిగిన ఎన్నికల్లో ఫరూక్ కు 48,554 ఓట్లు రాగా, ఖాన్ కు 37,779 ఓట్లు లభించాయి. 930 మంది నోటాకు ఓటేశారు. ఎన్నికల సందర్భంగా జరిగిన అల్లర్లలో ఎనిమిది మంది మరణించగా, పలువురికి గాయాలైన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో కేవలం 7.13 శాతం పోలింగ్ మాత్రమే నమోదైంది. గొడవలు జరిగిన పలు ప్రాంతాల్లో 13న రీపోలింగ్ నిర్వహించారు.