: పోలవరం ప్రాజెక్టుపై నా అనుమానాలు ఇవి... ఈ డీటెయిల్స్ ఇవ్వండి: ఉమా భారతికి కేవీపీ లేఖ
పోలవరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ఎంపీ కేవీపీ రామచంద్రరావు మరోసారి ప్రశ్నల వర్షం కురిపించారు. ఇప్పటికే పోలవరం ప్రాజెక్టు అంశాన్ని పార్లమెంటులో రెండు సార్లు లేవనెత్తిన కేవీపీ... ఈసారి కేంద్ర మంత్రి ఉమాభారతికి లేఖ రాశారు. ఈ లేఖలో పోలవరంపై అస్పష్టంగా ఉన్న పలు అంశాలను ప్రస్తావించారు. సందిగ్ధంగా, ఆందోళనతో ఉన్న ప్రజలకు వివరణ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ పలు ప్రశ్నలు సంధించారు. ఇప్పటి వరకు పెండింగ్ లో ఉన్న అనుమతుల గురించి వివరించాలని ఆయన సూచించారు. అలాగే పోలవరం నిర్మాణం నుంచి ఇప్పటి వరకు లభించిన అనుమతుల గురించి తేదీల వారీగా తెలియజేయాలని ఆయన కోరారు.
అలాగే 2014 మార్చి నెల వరకు కేంద్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు కోసం విడుదల చేసిన నిధుల వివరాలు వెల్లడించాలని ఆయన డిమాండ్ చేశారు. ఏప్రిల్ 2014 నుంచి 2 జూన్ 2014 వరకు, అలాగే 2 జూన్ నుంచి ఇప్పటి వరకు పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి ఇచ్చిన రుణాలు, కేంద్రం గ్రాంట్ల వివరాలు తెలపాలని ఆయన ఉమాభారతిని కోరారు. వాటితోపాటు ఛత్తీస్ గఢ్, ఒడిశా, ఏపీలో పోలవరం ప్రాజెక్టు బాధితుల కోసం చేపట్టిన పునరావాస కార్యక్రమాలను కూడా వెల్లడించాలని ఆయన సూచించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి పోలవరం ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలు అప్పగించడంలో పోలవరం ప్రాజెక్టు అధారిటీ పాత్రను వెల్లడించాలని ఆయన డిమాండ్ చేశారు.