: బాత్రూమ్ లోకి వెళ్లి గడియపెట్టుకుని ఏడ్చేవాడిని: షారూఖ్ ఖాన్
తన సినిమాలు పరాజయం పాలైతే... బాత్రూమ్ కు వెళ్లి గడియపెట్టుకుని బిగ్గరగా ఏడ్చేవాడినని బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్ తెలిపాడు. 60వ శాన్ ఫ్రాన్సిస్కో చలన చిత్రోత్సవానికి హాజరైన షారూఖ్, అమెరికా దర్శకుడు బ్రెట్ రత్నర్ తో వేదిక పంచుకున్నారు. ఈ సందర్భంగా సినీ పరిశ్రమలో ఎదురయ్యే జయాపజయాలను ఎలా ఎదుర్కొంటారని ఒక అభిమాని షారూఖ్ ఖాన్ ను ప్రశ్నించారు. దానికి షారూఖ్ సమాధానమిస్తూ, జయాపజయాలు సాధారణమని అన్నాడు.
తాను ఒక నటుడ్నని, తన సినిమా బాగా ఆడనప్పుడు బాత్రూమ్ కి వెళ్లి లోపల గడియపెట్టుకుని గట్టిగా ఏడుస్తానని చెప్పాడు. అలా చేయడం మంచిదేనని షారూఖ్ పేర్కొన్నాడు. వంద శాతం కష్టపడి పనిచేస్తే జయాపజయాలు పెద్దగా ప్రభావం చూపవని, నిజాయతీ, కష్టపడేతత్వం మంచి దారి చూపిస్తుందని షారూఖ్ సమాధానమిచ్చాడు. అనంతరం బ్రెట్ రత్నర్ కు లుంగి డాన్స్ స్టెప్పు నేర్పించాడు. ఈ వీడియో అభిమానులను ఆకట్టుకుంటోంది.