: కేవలం 160 రూపాయలకు 5.25 కోట్ల రూపాయల భవంతిని సొంతం చేసుకోండి!
కేవలం 160 రూపాయలకే బ్రిటన్ లో అద్భుతమైన ఆరు బెడ్రూంల హౌస్ ను సొంతం చేసుకోండంటూ బ్రిటన్ వ్యక్తి బంపర్ ఆఫర్ ప్రకటించాడు. ఈ ఆఫర్ వివరాల్లోకి వెళ్తే... బ్రిటన్‌కు చెందిన డన్ స్టన్ లోవే (37) 2011లో 4,35,000 పౌండ్లు (3.50 కోట్ల రూపాయలు) ఖర్చు చేసి ఆరు పడకలతో ఉన్న పెద్ద భవంతిని కొనుగోలు చేశాడు. తరువాత తన అభిరుచికి తగినట్టు దానిని పునరుద్ధరించాడు. ఇందుకు చాలా ఖర్చయింది. ఈ మొత్తాన్ని రుణంగా తీసుకున్నాడు. దీంతో ఆ రుణం తిరిగి చెల్లించడంలో ఇబ్బందులు ఎదురయ్యాయి. దీంతో ఆ భవంతిని విక్రయించాలని నిర్ణయించుకుని, 8.45 లక్షల పౌండ్లుగా ధర నిర్ణయించి విక్రయానికి ఉంచాడు.
అయితే ఆ ధరకు దానిని కొనేందుకు ఎవరూ ముందుకు రాలేదు. దీంతో ఆ ఇంటి ధరను మరికొంత తగ్గించి 8 లక్షల పౌండ్లుగా ప్రకటించాడు. అయినా ఎవరూ ఆయనను సంప్రదించలేదు. దీంతో మళ్లీ తగ్గించి, 6.50 లక్షల పౌండ్లు (5.25 కోట్ల రూపాయలు) గా నిర్ణయించి విక్రయానికి పెట్టాడు. ఈ ధరకు కూడా కొనుగోలు చేసేందుకు ఎవరూ ముందుకు రాలేదు. దీంతో తన భార్యతో చర్చించి...తన అందమైన భవంతిని లాటరీ పద్ధతిలో విక్రయించాలని నిర్ణయించుకున్నాడు. దీంతో కేవలం 2 పౌండ్ల (160 రూపాయల) కే ఆ ఇంటిని సొంతం చేసుకోవచ్చంటూ ప్రకటన చేశాడు. ఇందుకు చేయాల్సిందల్లా ఆన్ లైన్ ద్వారా కానీ, ఆఫ్ లైన్ ద్వారా కానీ టికెట్ కొనుగోలు చేయడమేనని అన్నాడు.
1 ఆగస్టు 2017న లాటరీ తీసి విజేతను ప్రకటిస్తామని తెలిపాడు. భవంతిని దక్కించుకునే ఈ అవకాశం అందరికీ అందుబాటులో ఉంటుందని, ఇందుకే కేవలం 2 పౌండ్లు మాత్రమే చెల్లించాలని తెలిపాడు. గడువు లోపు 5 లక్షల టికెట్లు విక్రయించాలని ఆయన లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటి వరకు ఆయన 1.20 లక్షల ( వీటి విలువ 96 లక్షల రూపాయలు) లాటరీ టిక్కెట్లను విక్రయించారు. విశేషం ఏమిటంటే, ఈ భవంతిని కొనుగోలు చేసేందుకు కేవలం బ్రిటన్ నుంచే కాకుండా అమెరికా, ఆస్ట్రేలియాల నుంచి కూడా ఆసక్తి చూపుతున్నారట!