: వారితో కలిసే ప్రసక్తే లేదని పవన్ కల్యాణ్ గతంలోనే స్పష్టం చేశారు: బోండా ఉమా
ప్రత్యేక హోదా విషయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు బాగానే పోరాడుతున్నారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇటీవల వ్యాఖ్యానించిన అంశంపై టీడీపీ నేత బోండా ఉమా మహేశ్వరరావు స్పందించారు. పవన్ కల్యాణ్ తమపై విమర్శలు చేయలేదని ఆయన అన్నారు. ప్రత్యేక హోదా విషయంలో టీడీపీ ఎంపీలను పవన్ తప్పుబట్టలేదని అన్నారు. జగన్తో పవన్ కలుస్తారని తాము అనుకోవడంలేదని, పవన్ తమ పార్టీతో సన్నిహితంగానే ఉంటారని ఆయన చెప్పారు. తాను దొంగలతో కలిసే ప్రసక్తే లేదని పవన్ గతంలోనే స్పష్టం చేశారని బోండా ఉమా వ్యాఖ్యానించారు. అలాగే కాంగ్రెస్ మాజీ నేత లగడపాటి రాజగోపాల్ ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసిన నేపథ్యంలో ఆయన టీడీపీలో చేరతారని వస్తోన్న పుకార్లను ఆయన కొట్టిపారేశారు. లగడపాటి రాజకీయాలనుంచి తప్పుకున్నట్లు ఆనాడే ప్రకటించారని అన్నారు. టీడీపీలో ఆయన చేరుతున్నారన్నది కేవలం ఊహాగానాలేనని పేర్కొన్నారు.