: కట్టప్పతో బాహుబలే తనను చంపమని చెప్పాడన్న 'కథ' నాకు బాగా నచ్చింది!: రమా రాజమౌళి
బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడని దేశ వ్యాప్తంగా సినీ అభిమానులు ఎన్నో ఊహగానాలు చేసుకుంటున్న విషయం తెలిసిందే. అయితే, ఈ అంశంపై రాజమౌళి సతీమణి రమా రాజమౌళి స్పందిస్తూ పలు ఆసక్తికర విషయాలు తెలిపారు. ఈ రోజు ఆమె ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... కొందరు మొన్నటివరకు బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడనుకున్నారని, తాజాగా బాహుబలిని కట్టప్ప నిజంగానే చంపాడా? అని కూడా మాట్లాడుకుంటున్నారని అన్నారు. తనను కొంతమంది బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడని అడగకుండా, డైరెక్టుగా ఇందుకే చంపాడు కదా.. అంటూ పలు కథలు చెప్పేస్తున్నారని ఆమె అన్నారు.
బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడని వస్తోన్న కథల్లో తనకు ఓ కథ బాగా నచ్చిందని రమా రాజమౌళి చెప్పారు. బాహుబలి 2 ట్రైలర్‌లో బాహుబలి డైలాగ్ అయిన దేశం కోసం ప్రాణత్యాగానికి సిద్ధం అనే వ్యాఖ్య ఆధారంగా కొందరు బాహుబలే తనను చంపమని కట్టప్పను ఆదేశించాడని అనుకుంటున్నారని అన్నారు. తమ రాజ్య సంక్షేమం కోసం బాహుబలి తనను తాను చంపమని కట్టప్ప ఆదేశించాడని వస్తోన్న ఆ కథ తనకు ఎంతగానో నచ్చిందని చెప్పారు. అయితే, ఈ కథే నిజమో కాదో చెప్పబోనని అన్నారు. నిజంగా బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడో తాను చెప్పబోనని తేల్చి చెప్పేశారు.