: అప్పట్లో ఎన్టీఆర్ ఇచ్చిన ఇంటి స్థానంలోనే చంద్రబాబు కొత్త ఇళ్లు కట్టుకున్నారు.. తప్పేముంది?: మంత్రి అమరనాథరెడ్డి
హైదరాబాద్‌లోని జూబ్లిహిల్స్‌లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇల్లు నిర్మించుకోవడం పట్ల ప్రతిపక్ష పార్టీల నేతలు చేస్తోన్న విమర్శలపై ఏపీ మంత్రి అమరనాథరెడ్డి మండిపడ్డారు. కూలి చేసేవారు కూడా వారి స్తోమతకు తగ్గ ఇల్లు కట్టుకుంటారని, ఓ ముఖ్యమంత్రి ఇల్లు కట్టుకోవడంలో తప్పేంటని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడికి గతంలోనే ఎన్టీఆర్ హైదరాబాద్‌లో ఇల్లు ఇచ్చారని ఆయన అన్నారు. ఇప్పుడు చంద్రబాబు ఆ ఇంటి స్థానంలోనే కొత్త ఇంటిని నిర్మించుకున్నారని ఆయన అన్నారు. చంద్రబాబుపై విమర్శలు గుప్పిస్తోన్న వారంతా ఎక్కడెక్కడ ఇళ్లు కట్టుకున్నారన్న విషయం అందరికీ తెలిసిందేనని ఆయన వ్యాఖ్యానించారు.
ఏపీలో ఉపాధి, ఉద్యోగావకాశాల గురించి తమ ప్రభుత్వంపై అనవసర ఆరోపణలు చేయడం భావ్యం కాదని మంత్రి అన్నారు. తమ ప్రభుత్వం ఇప్పటికి రాష్ట్రంలో 125 పెద్ద, మధ్య తరగతి పరిశ్రమలను ప్రారంభించిందని, తద్వారా 50 వేల మందికి ఉపాధి అవకాశాలను పొందుతున్నారని ఆయన అన్నారు. గతంలో గుజరాత్‌లో మాత్రమే పరిశ్రమలు పెట్టడానికి ముందుకు వచ్చేవారని, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో పరిశ్రమలు పెట్టడానికి ప్రముఖులు ముందుకు వస్తున్నారని ఆయన తెలిపారు.