: టీడీపీ ఎంపీ శివప్రసాద్‌పై చంద్రబాబు ఆగ్రహం.. హెచ్చరిక
చిత్తూరు పార్లమెంట్ సభ్యుడు, తెలుగుదేశం నేత శివప్రసాద్ నిన్న చేసిన పలు వ్యాఖ్యలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల జరిపిన మంత్రివర్గ విస్తరణలో ఎస్సీలకు తీవ్ర అన్యాయం జరిగిందని, ఎస్సీలను అన్ని రకాలుగా మోసం చేస్తున్నారని తమ అధిష్ఠానంపై శివప్రసాద్ పలు వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.
అయితే, ఈ రోజు మంత్రులతో చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పలు అంశాలను ప్రస్తావించారు. అందులో ముఖ్యంగా శివప్రసాద్ చేసిన వ్యాఖ్యలపై చర్చించారు. అసలు ఏం జరిగిందని మంత్రి అమర్‌నాథ్‌రెడ్డిని చంద్రబాబు అడిగి తెలుసుకొని, పలు విషయాలు వెల్లడించారు. హథీరాంజీ మఠం భూములు ఇవ్వాలని సదరు ఎంపీ సిఫారసు లేఖ ఇచ్చినట్లు వీడియో కాన్ఫరెన్స్ లో మంత్రులతో తెలిపారు. అయితే, ఆ భూముల కేటాయింపు నిబంధనలకు విరుద్ధమని తిరస్కరించినట్లు తెలిపారు. దళితులకు తమ సర్కారు ఎన్నో ప్రయోజనాలు అందిస్తోందని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. వ్యక్తిగత అజెండాలతో ఇటువంటి వ్యాఖ్యలు చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. శివప్రసాద్ వ్యక్తిగత అజెండాతోనే ఇటువంటి వ్యాఖ్యలు చేసినట్లు మంత్రులు కూడా అభిప్రాయపడ్డారు.