: కమ్ముకుంటున్న యుద్ధ మేఘాలు.. పట్టుదలకు పోవద్దని సూచించిన చైనా
అమెరికా, ఉత్తర కొరియాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఉత్తరకొరియా నియంత కిమ్ జాంగ్ ఉన్ ఈరోజు ఆరో అణు పరీక్షకు సిద్ధమవుతున్నారన్న నిఘా వర్గాల సమాచారంతో... అమెరికా భారీ ఎత్తున సైన్యాన్ని, ఆయుధ సంపత్తిని ఇప్పటికే దక్షిణకొరియాకు పంపించింది. అయితే, అమెరికాకు భయపడే ప్రసక్తే లేదని ఉత్తరకొరియా అధినేత కిమ్ జాంగ్ స్పష్టం చేశారు.
దీంతో, ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. ఈ నేపథ్యంలో, మరో అగ్రదేశం చైనా స్పందించింది. ఇరుదేశాలు సంయమనం పాటించాలని సూచించింది. ఉద్రిక్తతలు మరింత పెరిగేలా చర్యలు తీసుకోరాదంటూ తెలిపింది. రెచ్చగొట్టే ప్రకటనలు కూడా చేయకుండా ఉండాలని సూచించింది. మరోవైపు, ఇతర దేశాల సూచనలను పట్టించుకోకుండా కిమ్ జాంగ్ అణు పరీక్షలు నిర్వహిస్తే, ట్రంప్ సర్కారు ఉత్తరకొరియాపై దాడులకు పాల్పడవచ్చని అంతర్జాతీయ విశ్లేషకులు కూడా అంచనా వేస్తున్నారు.