: ఇంటర్ తప్పుతానన్న భయంతో బాలిక ఆత్మహత్య... ఫస్ట్ క్లాసులో పాస్ కావడంతో గుండెలవిసేలా రోదిస్తున్న తల్లిదండ్రులు
జి.దివ్య... ప్రకాశం జిల్లాకు పదేళ్ల క్రితం వలసవచ్చి పుల్లడిగుంటలో స్థిరపడి, పొలాలను కౌలుకు తీసుకుని పనిచేసుకుంటున్న వెంకటేశ్వర్లు, లింగమ్మ దంపతుల కుమార్తె. గుంటూరులోని ఓ ప్రైవేటు కాలేజీ హాస్టల్ లో ఉంటూ ఇంటర్ చదివింది. తాను పరీక్ష సరిగ్గా రాయలేదని, తప్పుతానన్న ఆత్మన్యూనతతో, రిజల్ట్స్ వస్తాయనడానికి కొన్ని గంటల ముందు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆపై నిన్న ప్రకటించిన ఫలితాల్లో దివ్య ఫస్ట్ క్లాసులో పాస్ అయింది.
పరీక్షలు రాసొచ్చినప్పటి నుంచి దివ్య ముభావంగా ఉందని, తీవ్ర మానసిక ఆవేదనతోనే ఆత్మహత్యకు పాల్పడిందని తెలుస్తోంది. తమ బిడ్డ చనిపోవడం, ఆపై ఆమె ఉత్తీర్ణురాలైనట్టు తెలియడంతో వెంకటేశ్వర్లు, లింగమ్మ దంపతులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. ఇదిలావుండగా మంగళగిరికి చెందిన నాగవర్థన అనే యువకుడు పరీక్ష తప్పానన్న వ్యథతో ఇక్కడి పెదకోనేరులో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తాడేపల్లి ముగ్గురోడ్డుకు చెందిన సోమశేఖర్ అనే యువకుడు సైతం ఇంటర్ ఫెయిల్ అవడంతో, ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.