: ఫేస్ బుక్ ఫ్రెండ్ ని హోటల్ కి కాఫీకి పిలిచి.. అత్యాచారం!
అపరిచితులతో ఫేస్ బుక్ స్నేహాలు ఎలాంటి దారుణాలకు కారణమవుతాయో తెలిపే ఘటన ముంబైలో చోటుచేసుకుంది. ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే.... గుజరాత్ కు చెందిన వ్యాపారవేత్త ఫేస్ బుక్ లో ఒక గృహిణితో పరిచయం పెంచుకున్నాడు. పరిచయం పెరగడంతో ఫోన్ నెంబర్లు కూడా ఇచ్చిపుచ్చుకున్నారు. ఈ పరిచయం కూడా ముదరడంతో ఒకసారి కలుద్దామని అనుకున్నారు. ఈలోగా వ్యాపారం పని మీద తాను ముంబైకి వచ్చానని, తనను కలవాలనుకుంటున్నానని ఆమెకు ఫోన్ చేశాడు. దీంతో ఆమె గేట్ వే ఆఫ్ ఇండియా వద్ద అతనిని కలిసింది. తాను పక్కనే ఉన్న స్టార్ హోటల్ లో ఉంటున్నానని, కాఫీ తాగుదామని అతను కోరడంతో సరే అని ఆమె హోటల్ కు వెళ్లింది.
అనంతరం ఆమెకు ముందు మంచినీళ్లు తాగమని ఇచ్చాడు. నీళ్లు తాగిన అనంతరం ఆమెను మగత కమ్మేసింది. దీంతో అతను ఆమెపై అత్యాచారానికి తెగబడ్డాడు. అయితే బాధితురాలు అచేతనంగా ఉండడంతో అతనిని ప్రతిఘటించలేకపోయింది. దారుణం జరిగిన కొంత సేపటికి శక్తిని కూడదీసుకుని బాధితురాలు తన కుటుంబ సభ్యుల వద్దకు వెళ్లి, జరిగిన దారుణాన్ని తన భర్తకు వివరించింది. దీంతో అతను నిందితుడికి ఫోన్ చేసి గొడవపడ్డాడు. అనంతరం పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టారు. దీంతో రెండు రోజుల కోసం ముంబైలో హోటల్ బుక్ చేసుకుని బిల్లు పే చేసిన గుజరాత్ వ్యాపారవేత్త మరోరోజు ఉండగా, పరారయ్యాడు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.