: యజమానిని కాపాడి ప్రాణాలొదిలిన శునకం!
ఆవేశంలో దాడి చేయడానికి వచ్చిన వ్యక్తి నుంచి యజమానురాలిని కాపాడేందుకు శునకం ప్రాణాలొదిలిన ఘటన ముంబైలో చోటుచేసుకుంది. ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే... తల్లి మరణంతో ఒంటరి తనం నుంచి దూరమయ్యేందుకు సుమితి అనే ముంబై మహిళ ఒక కుక్కను తెచ్చుకుని, దానికి లక్కీ అని పేరు పెట్టుకుని పెంచుకుంటోంది. ఈ క్రమంలో తాజాగా సుమితి పొరుగింట్లో ఉండే వెంకటేష్ దేవేంద్ర తన ప్రేయసి జ్యోతి, ఆమె సోదరి రోసీతో బేకరీ వద్ద గొడవపడ్డాడు. ఇది చిలికి చిలికి గాలివానగా మారడంతో తీవ్ర ఆగ్రహంతో ఇంట్లోకి వెళ్లిన వెంకటేశ్ దేవేంద్ర కత్తితీసుకుని రోసీ మీదకి వచ్చాడు.
వెంటనే రోసీ పొరుగునే ఉన్న సుమితి ఇంట్లో దూరి ప్రాణాలు రక్షించుకునే ప్రయత్నం చేసింది. దీంతో ఆమెను అనుసరించిన దేవేంద్ర... కత్తిపట్టుకుని ఆమె ఇంట్లోకి వచ్చే ప్రయత్నం చేశాడు. సుమితి అతనిని ఇంట్లో ప్రవేశించకుండా అడ్డుకుని, అతనిని పక్కకు తోసేసింది. రెట్టించిన కోపంతో దేవేంద్ర ఆమెపై కత్తిఎత్తాడు. దీనిని చూసిన కుక్క ఒక్కక్షణం కూడా ఆలస్యం చేయకుండా దేవేంద్రపై దూకింది. దీంతో భయపడిన దేవేంద్ర చేతిలో ఉన్న కత్తితో కుక్క లక్కీని ఎడాపెడా పొడిచేశాడు. తీవ్రగాయాలపాలైన లక్కీ ప్రాణాలు కోల్పోయింది. తన ప్రాణాలు కాపాడిన లక్కీని చూసి యజమానురాలు కన్నీరు మున్నీరవుతోంది. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతనిని అరెస్టు చేశారు.