: దారుణ హత్యకు దారితీసిన వివాహేతర సంబంధం!
సిద్ధిపేట జిల్లా నంగునూరు మండలం గట్లమల్యాల గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. ఆ గ్రామానికి చెందిన దండ్ల లావణ్య (28) ఈ నెల 9న దారుణ హత్యకు గురి కావడంతో, ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టి నిందితుడిని పట్టుకున్నారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను పోలీసులు వెల్లడించారు. లావణ్య భర్త గల్ఫ్ దేశంలోని ఖతర్‌కి ఉపాధి నిమిత్తం వెళ్లాడు. అయితే, ఇంటి వద్దనే ఉంటున్న లావణ్యకు అదే గ్రామానికి చెందిన రంగు పర్శరాములు గౌడ్‌తో పరిచయం ఏర్పడింది. మూడేళ్లుగా అతడితో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. అయితే, కొంత కాలంగా ఆమె తనతో మాట్లాడకపోవడంతో లావణ్యపై అనుమానం పెంచుకున్న పర్శరాములు ఆమెను హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు.
ఈ క్రమంలో ఈ నెల 9న లావణ్యకు ఫోన్ చేసిన పర్శరాములు తాము ఎప్పుడూ కలుసుకునే చోటుకి రావాలని చెప్పాడు. దాంతో అక్కడికి వెళ్లిన లావణ్య కాసేపు అతడితో మాట్లాడింది. ఇంతలో, తనతో తెచ్చుకున్న గొడ్డలి తీసి, ఆమెను పర్శరాములు దారుణంగా హత్యచేశాడు. అనంతరం ఆమె మెడలో ఉన్న బంగారు గొలుసు తీసుకుని, కాళ్ల కడియాలు తీసేందుకు ప్రయత్నించగా అవి రాకపోవడంతో కాళ్ల పాదాలు నరికి వేరుచేసి వాటిని తీసుకున్నాడు. లావణ్య మృతదేహాన్ని ఓ చీరలో మూటకట్టి బైక్‌పై తీసుకెళ్లి గ్రామ శివారులోని పెద్ద చెరువు వద్ద ఓ గుంతలో పడేసి, ఊర్లో నుంచి పారిపోయాడు. ఎట్టకేలకు నిందితుడిని పట్టుకున్న పోలీసులు అతడిపై 302, 376, 379, 201 సెక్షన్‌ల కింద కేసు నమోదు రిమాండ్‌కు తరలిస్తున్నట్లు చెప్పారు.