: చంద్రబాబుకు అల్టిమేటం జారీ చేసిన ముద్రగడ
కాపులకు రిజర్వేషన్లను కల్పిస్తామంటూ ఇచ్చిన హామీకి ముఖ్యమంత్రి చంద్రబాబు కట్టుబడాలని... వచ్చే నెల 7వ తేదీ లోపల ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలంటూ కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం అల్టిమేటం జారీ చేశారు. ముఖ్యమంత్రి నుంచి స్పందన లేకపోతే అదే రోజు కాపు జేఏసీ నేతలతో సమావేశమవుతామని చెప్పారు. 7వ తేదీ నుంచి ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.
కాపు రిజర్వేషన్లపై ముఖ్యమంత్రి చర్చలకు ఆహ్వానిస్తే... తమ తరుపున ఐదుగురిని చర్చలకు పంపుతామని తెలిపారు. కాపు ఉద్యమాన్ని నాశనం చేయడానికి చంద్రబాబు తన అనుభవాన్నంతా ఉపయోగిస్తున్నారని ముద్రగడ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యమాన్ని ఉక్కుపాదంతో అణచివేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని... కాపు సోదరులంతా ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలని కోరారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయని వారిపై చర్యలు తీసుకోవాలంటూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇటీవల ఆదేశించారని... ఈ విషయాన్ని చంద్రబాబు గుర్తు పెట్టుకోవాలని హితవు పలికారు.