: ఇన్ఫోసిస్ క్యూ-4 ఫలితాలు... 2.8 శాతం తగ్గి రూ. 3,603 కోట్లకు నికరలాభం
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ దిగ్గజం ఇన్ఫోసిస్ ఈ ఉదయం నాలుగో త్రైమాసికం ఆర్థిక ఫలితాలను విడుదల చేసింది. కన్సాలిడేటెడ్ విధానంలో సంస్థ నికర లాభం మార్చి 31తో ముగిసిన ఆర్థిక త్రైమాసికంలో రూ. 3,603 కోట్లుగా నమోదైందని సంస్థ తెలిపింది. అంతకుముందు త్రైమాసికం నెట్ ప్రాఫిట్ రూ. 3,708 కోట్లతో పోలిస్తే, ఇది 2.83 శాతం తక్కువ. మొత్తం ఆదాయం సైతం 0.89 శాతం తగ్గి రూ. 17,120 కోట్లకు తగ్గిందని సంస్థ వెల్లడించింది. ఐటీ రంగం సంక్షోభంలో చిక్కుకున్న వేళ, తాము మెరుగైన ఫలితాలను చూపామని, ఈ సందర్భంగా ప్రతి షేరుపై రూ. 14.75 డివిడెండ్ గా ఇవ్వాలని బోర్డు నిర్ణయించిందని, త్వరలోనే షేర్ల బైబ్యాక్ ను ప్రకటించనున్నామని సంస్థ తెలిపింది. సంస్థపై ఇన్వెస్టర్లకు నమ్మకం కుదిరేలా చూసేందుకే రూ. 13 వేల కోట్ల (సుమారు 2 బిలియన్ డాలర్లు) విలువైన షేర్లను బై బ్యాక్ చేయనున్నట్టు పేర్కొంది.
ఇక పూర్తి ఆర్థిక సంవత్సరంలో లాభం 6.4 శాతం వృద్ధితో రూ. 14,353 కోట్లకు చేరిందని ఇన్ఫోసిస్ వెల్లడించింది. 2017-18 ఆర్థిక సంవత్సరంలో సంస్థ ఆదాయ వృద్ధి 6.5 శాతం నుంచి 8.5 శాతం మధ్య ఉండవచ్చని తెలిపింది. కాగా, గత సంవత్సరం ఇదే సమయంలో ఇన్ఫీ ఈక్విటీ విలువతో పోలిస్తే ప్రస్తుతం 3.27 శాతం తక్కువగా రూ. 968 వద్ద ఈక్విటీ విలువ కొనసాగుతోంది. ఈ ఏడాది కాలంలో సెన్సెక్స్ సూచిక 11 శాతం పెరిగినప్పటికీ, ఇన్ఫోసిస్ నష్టపోవడం గమనార్హం. ఇదిలావుండగా, సంస్థలో స్వతంత్ర డైరెక్టర్ గా రవి వెంకటేశన్ ను నియమించినట్టు కూడా సంస్థ పేర్కొంది.