: అమెరికాలో మరో జాత్యహంకార దాడి... ఈసారి బాధితురాలు ముస్లిం మహిళ!
అమెరికాలో మరో జాత్యహంకార దాడి చోటుచేసుకుంది. ఈ దాడిలో ముస్లిం మహిళ బాధితురాలిగా మారింది. ఈ ఘటన వాషింగ్టన్ లో చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే... పేరు చెప్పేందుకు ఇష్టపడని ఆ మహిళ మసీదులో ప్రార్థన ముగించుకొని ఇంటికి నడుచుకుంటూ వెళ్తుండగా... వేగంగా వచ్చిన ఓ కారు ఆమె పక్కన ఆగింది. కారులోంచి దిగిన ఓ ఆగంతుకుడు ఆమెను హిజాబ్ (ముస్లిం మహిళలు సంప్రదాయంగా ధరించే ముసుగు) తొలగించాలని ఆదేశించాడు.
ఇందుకు ఆమె నిరాకరించడంతో ఆమెకు హెచ్చరికలు జారీ చేశాడు. దానికి ఆమె ఎదురు తిరగడంతో కోపోద్రిక్తుడైన ఆ వ్యక్తి ఆమెపై దాడికి దిగాడు. ఆమెను కిందపడేసి, గొడ్డును బాదినట్టు బాదాడు. దెబ్బలు తాళలేక కిందపడిపోయిన ఆ మహిళ హిజాబ్ ను అతను తొలగించి, ఫుట్ పాత్ పై ఆమెను పడేసి, ఆమె ముఖంపై పిడిగుద్దులు కురిపించాడు. దీంతో ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. అనంతరం ఎవరో ఆమెను ఆసుపత్రిలో చేర్పించగా, చికిత్స తీసుకున్న అనంతరం ఇంటికి చేరింది.