: సాహసం చేసి ప్రాణం మీదికి తెచ్చుకున్నాడు...తీవ్ర గాయాలతో బయటపడ్డాడు!
కేవలం 350 డాలర్ల ప్రైజ్ మనీ కోసం దుస్సాహసానికి ఒడిగట్టాడో సాహసికుడు. వివరాల్లోకి వెళ్తే... రష్యాలోని కెమెరోవో ప్రాంతంలో ఉన్న ఓ రిసార్టులో ఏటా ‘పూల్ అండ్ రైడ్’ పేరుతో పోటీలు నిర్వహిస్తుంటారు. ఈ పోటీల్లో విజేతకు కేవలం 350 డాలర్లు ప్రైజ్ మనీగా ఇస్తారు. పోటీలో భాగంగా గడ్డ కట్టి ఉన్న మంచుకొండ పైనుంచి స్కీయింగ్ చేస్తూ అక్కడి స్విమ్మింగ్ పూల్ లో దూకాలి.
సాధారణంగా దూకడం కాకుండా కాస్త విభిన్నంగా ఎవరు ప్రయత్నిస్తారో... వారు విజేతగా నిలుస్తుంటారు. అయితే అందరికంటే భిన్నంగా ట్రై చేయాలని భావించిన ఆంటన్ రెడ్వోక్ (26) తాను వేసుకున్న సూటుపై పెట్రోల్ పోసి నిప్పంటించుకున్నాడు. దీంతో మంటలు ఎగసిపడ్డాయి. ఊహించని విధంగా అతను దూకేలోపు సూట్ కాలిపోయి, ఒంటికి మంటలు అంటుకున్నాయి. దీంతో ఆ మంటలతోనే స్విమ్మింగ్ పూల్ లోకి దూకేశాడు. తీవ్రంగా గాయాలైన అతనిని వెంటనే ఆసుపత్రిలో చేర్చడంతో అదృష్టం కొద్దీ బతికి బయటపడ్డాడు.