: రాహుల్ ద్రవిడ్ లేకుంటే ఇలా ఆడడం సాధ్యం కాదు: సంజు శాంసన్


ఐపీఎల్ సీజన్ 10లో ఢిల్లీ డేర్ డెవిల్స్ తెగువతో పూణే సూపర్ జెయింట్ జట్టు ఘోరపరాజయం పాలైంది. టాస్ ఓడి బ్యాటింగ్ ప్రారంభించిన ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టుకు దేశవాళీ ఆటగాళ్లు అసాధారణ స్కోరు తెచ్చిపెట్టారు. ప్రధానంగా వర్థమాన ఆటగాళ్లు సంజు శాంసన్, రిషబ్ పంత్ అద్భుత ప్రదర్శనతో భారీ స్కోరుకు బాటలు వేయగా, క్రిస్ మోరిస్ మెరుపులు ఢిల్లీ డేర్ డెవిల్స్ కు 205 పరుగుల భారీ స్కోరు తెచ్చిపెట్టాయి.

అనంతరం పూణే సూపర్ జెయింట్ బ్యాటింగ్ ఆర్డర్ లో స్టార్లు ఉన్నప్పటికీ ఏ దశలోనూ పోటీ ఇవ్వలేదు. దానికి తోడు ఢిల్లీ సమర్ధవంతంగా ఫీల్డింగ్ చేయడంతో పూణే ఆట కేవలం 16.1 ఓవర్లపాటే కొనసాగింది. 108 పరుగులకే పూణే ఆటగాళ్లను ఢిల్లీ బౌలర్లు ఆలౌట్ చేసి, 97 పరుగుల తేడాతో అద్భుత విజయం సాధించారు. ఐపీఎల్ సీజన్ 10లో తొలి సెంచరీతో సత్తాచాటి, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, సిక్సర్ల అవార్డులను సంజు శాంసన్ గెలుచుకోగా, మోస్ట్ స్టైలిష్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును క్రిస్ మోరిస్ దక్కించుకున్నాడు.

అనంతరం సంజు శాంసన్ మాట్లాడుతూ, రాహుల్ ద్రవిడ్ లేకుంటే తానిలా ఆడడం సాధ్యం అయ్యేది కాదని తెలిపాడు. గతంలో కూడా రాహుల్ సర్ సారధ్యంలో తాను అద్భుత ప్రదర్శన చేశానని చెప్పాడు. రాహుల్ సర్ ప్రతిక్షణం వెన్నంటి ఉంటారని, ఎలా ఆడాలో, మైదానంలో ఎలా ఒత్తిడిని జయించాలో చెబుతారని అన్నాడు. రాహుల్ ద్రవిడ్ టెక్నిక్ ఆటను మరింత మెరుగుపరిచిందని, 30, 40 స్కోర్లను భారీ స్కోర్లుగా ఎలా మలచాలో ఆయన వివరంగా చెబుతారని సంజు శాంసన్ తెలిపాడు. ఆయన వల్లే తాను రాణించి, సెంచరీ చేశానని, ఆయనకు ధన్యవాదాలని తెలిపాడు. 

  • Loading...

More Telugu News