: 5 వేల ఏళ్ల నాటి వెన్నముద్ద దొరికింది... తినడానికి భేషుగ్గా ఉంది!


బ్రిటన్‌ లో వేల ఏళ్లుగా భూమిలో ఉన్న వెన్నముద్దలు లభ్యమయ్యాయి. ఇందులో విశేషమేంటంటే... ఈ వెన్నముద్దలు తినడానికి అనువుగా, ఏమాత్రం చెడిపోకుండా భేషుగ్గా ఉండడం ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని కలిగిస్తున్నాయి. దాని వివరాల్లోకి వెళ్తే... ఐర్లాండ్‌ కౌంటీ మేత్‌ లో జాక్‌ కాంన్వే అనే వ్యక్తి భూమి చదును చేస్తుండగా చెక్క బ్యారెల్‌ ఒకటి దొరికింది. దానిని తెరిచి చూడగా, అందులో వెన్నముద్ద లభ్యమైంది. అది సుమారు 10 కేజీల బరువుంది. ఇంకా విశేషమేంటంటే, ఆ వెన్నముద్ద దాదాపు 2 వేల ఏళ్ల క్రితం నాటిదని పరిశోధనలో తేలింది.

అలాగే 2009లో కౌంటీ కిల్‌ డారేలో మరో వ్యక్తికి సుమారు 30 కేజీల వెన్నముద్ద భూమిలోని బ్యారెల్ లో దొరికింది. ఇది 3 వేల ఏళ్లనాటిదని పరిశోధనలో తేలింది. తాజాగా ఓఫలే కౌంటీలో ఓ రైతుకు దొరికిన వెన్నముద్ద సుమారు 5 వేల ఏళ్ల నాటిదని తేలింది. దీని బరువు 50 కేజీలు. ఇన్ని వేల ఏళ్లయినా వెన్నముద్దలు చెక్కు చెదరకుండా, తాజాగా తినేందుకు వీలుగా ఉండడం ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. మధ్యయుగం నాటి ప్రజలు ఆవుపాలతో చేసిన వెన్నను చెక్క బ్యారెల్స్‌ లో భద్రపరిచి భూమిలో పాతి పెట్టి నిల్వచేసుకునేవారు. ఇలా భూమిలో పాతిపెట్టడం ద్వారా ఈ వెన్నముద్ద మైనంలా మారుతుంది. ఇలా మారిన వెన్న ఎన్నిరోజులైనా చెక్కుచెదరదు సరికదా...తినేందుకు అనువుగా ఉంటుంది.

అప్పట్లో అద్దె, పన్ను చెల్లించేందుకు, రూకలకు బదులకు వెన్నను ఇచ్చేవారని చరిత్ర చెబుతోంది. దీంతో వెన్నను కరెన్సీగా కూడా వినియోగించేవారని, వెన్నను ఇలా జాగ్రత్తగా భద్రపరిచేవారని తెలుస్తోంది. అంతే కాకుండా అప్పట్లో పశుసంపద ఎవరివద్ద ఎక్కువ ఉంటే వారే సంఘంలో పలుకుబడి ఉన్న వ్యక్తి అన్న సంగతి తెలిసిందే. పశుసంపద ఉండడం వల్ల విరివిగా లభించే వెన్నను నిల్వచేసుకోవడం కూడా ఒక కారణం అని తెలుస్తోంది. ఏదైనా మన పూర్వీకుల టెక్నాలజీయే టెక్నాలజీ...ఎలాంటి శీతలీకరణ యంత్రాలు లేకుండా కేవలం భూమిలో పాతిపెట్టడం ద్వారా తాజాగా నిల్వ చేయడం గ్రేట్ అని పలువురు పేర్కొంటున్నారు. 

  • Loading...

More Telugu News