: పాకిస్థాన్ చిత్రహింసల గురించి వివరించిన పాక్ మాజీ బందీ కుటుంబ సభ్యులు!
తాజాగా ఉరిశిక్షకు గురైన కుల్ భూషణ్ జాదవ్ గూఢచర్యం చేశానని అంగీకరించారని పాకిస్థాన్ చెబుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన ఎందుకు? ఎలా? నేరాన్ని అంగీకరించి ఉంటారన్న విషయాన్ని గతంలో భారత సరిహద్దులు దాటి పాకిస్థాన్ కు బందీగా చిక్కిన సైనికుడు చందు ఛవాన్ కుటుంబ సభ్యులు వివరించారు. భారతీయుడెవరైనా పాకిస్థాన్ కు చిక్కితే నరకం చూపిస్తారని వారు తెలిపారు. చెప్పలేని విధంగా చిత్రహింసలు పెడతారని చెప్పారు. డ్రగ్స్ ను ఎక్కించి వేదనతో కుమిలిపోయేలా చేస్తారని చెప్పారు. చిట్టచివరికి ఆ బాధలు భరించలేక తనను చంపేయమని వేడుకునేలా తయారు చేస్తారని తెలిపారు.
ఎవరితో మాట్లాడించినా, లేదా ఏది అడిగినా, తనను చంపేయమని అంటారని, లేదా వారేం చెబితే అదే చెప్పేలా తయారవుతారని అన్నారు. కుల్ భూషణ్ జాదవ్ ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో ఎవరికీ తెలియదని, చీకటి గదుల్లో ఉంచుతారని, కేవలం బతికేందుకు సరిపడా ఆక్షిజన్ ఉండే గదుల్లో మాత్రమే ఉంచుతారని, చిత్రహింసలు పెడతారని, చందూ చవాన్ ను పెట్టిన చిత్రహింసలకు ఆయన ఇంకా తేరుకోలేదని వారు తెలిపారు. అప్పుడప్పుడు ఊహించని విధంగా వ్యవహరిస్తాడని, పాకిస్థాన్ నుంచి బయటపడ్డ రెండు నెలల వరకు ఊరికే భయపడేవాడని వారు తెలిపారు.