: చంద్రబాబు ఇంట్లో అడుగుకు 40వేల విలువైన మార్బుల్స్ వాడారు: భూమన కరుణాకర్ రెడ్డి
అమరావతిలో అది చేస్తా, ఇది చేస్తా అంటూ మాటలు చెబుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు... తన నివాసాన్ని మాత్రం షాంఘై, సింగపూర్, దావోస్ స్థాయిలో కట్టుకున్నారని వైకాపా ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్ రెడ్డి విమర్శించారు. ఏపీ ఉద్యోగులందరినీ అమరావతికి తరలించిన చంద్రబాబు... తన ఇంటిని మాత్రం హైదరాబాదులో కట్టుకున్నారని అన్నారు. ఈ ఇంటి నిర్మాణం కోసం వందల కోట్ల ఖర్చు చేశారని తెలిపారు. ఇంటి నిర్మాణంలో అత్యంత ఖరీదైన విదేశీ వస్తువులు వాడారని... అడుగుకు రూ. 30 వేల నుంచి రూ. 40 వేల విలువ చేసే ఇటాలియన్ మార్బుల్స్ వాడారని అన్నారు.
వైసీపీ అధినేత జగన్ ఇంటికి నిత్యం వందలాది మంది కార్యకర్తలు వచ్చి పోతుంటారని... కానీ, చంద్రబాబు ఇంటిని ఇంతవరకు ఎవరూ చూడలేదని భూమన విమర్శించారు. జగన్ గురించి టీడీపీ నాలెడ్జ్ సెంటర్ అసత్యాలను ప్రచారం చేస్తోందని... అందుకే, తాము చంద్రబాబు ఇంటి గురించి మాట్లాడాల్సి వస్తోందని చెప్పారు. జగన్ ఇంట్లో హెలిప్యాడ్, సినిమా థియేటర్లు ఉన్నాయన్న అసత్య ఆరోపణలను టీడీపీ నేతలు నిరూపించగలరా? అని ప్రశ్నించారు.